Tuesday, May 7, 2024

ఎమ్మెస్సార్ మృతికి మంత్రులు ఈట‌ల‌, గంగుల సంతాపం…

క‌రీంన‌గ‌ర్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెన్నేని సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1934 జనవరి 14న జన్మించిన ఆయన కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన ఎమ్‌ఎస్ఆర్ కరీంనగర్ నుండి 1971 నుండి 1984 వరకు మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, కేరళ, కర్నాటక రాష్ట్రాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించారు. ఇందిరాగాంధీ సన్నిహితుడిగా ఉన్న ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1990 నుండి 1994 వరకు, 2007 నుండి 2014 వరకు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో పీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేశారు.
కాగా, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్, గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మానవతావాది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఎమ్మెస్సార్, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ముక్కుసూటి మనిషిగా సమస్యల పరిష్కారానికి ఎమ్మెస్సార్ చేసిన సేవల్ని స్మరించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్, ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, ఈ విషాద సమయంలో దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని త‌మ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement