Sunday, December 8, 2024

Kaleswaram Scam – ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు – మాజీ సీఎంపై మండిప‌డ్డ‌ కోదండ‌రాం

హైద‌రాబాద్ – ‘ఎక్కడ పైసలు సప్పుడు చేస్తయో.. అక్కడ జ్ఞానం పని చేయదు’ అనేది ఎనుకటి సామెతని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తీరుకు ఇదే నిదర్శనంగా నిలిచిందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే మాజీ సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. దీనికోసం ప్రాణహిత – చేవెళ్ల లిఫ్ట్ స్కీమ్ ను రీడిజైన్ చేశారని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తక్కువ ఖర్చుతో నీటిని తెచ్చుకునే మార్గం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం దానిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని చెప్పారు. దీని స్థానంలో గోదావరి – కృష్ణా లింక్ ప్రాజెక్టును కేసీఆర్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే రెండు ప్రధాన నదుల కింద ఆయకట్టు ధ్వంసమయ్యేదని, రైతులు ఆగమయ్యేవారని చెప్పారు. కొంతమంది కాంట్రాక్టర్లు, కొన్ని పైపుల కంపెనీలు మాత్రమే బాగుపడేవని తెలిపారు. అయితే, ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి తెలంగాణను ఆ ప్రమాదం నుంచి తప్పించారని ప్రశంసించారు.

ఇంజినీర్స్​ ఫోరం ఆధ్వర్యంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​..
కాళేశ్వరం లోపాలపై తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్​లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరంలోని లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాలను ముందే ఊహించి ఇంజనీర్లు హెచ్చరించినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రికార్డుల కోసమే పనిచేసింది తప్ప ప్రాజెక్టులు పది కాలాలు మన్నికగా ఉండాలనే ఆలోచన చేయలేదన్నారు. రైతులకు దీర్ఘకాలం పాటు ఉపయోగపడాలనే లక్ష్యం, చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లోపించిందని విమర్శించారు.

ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి..
ఎగువన ఉన్న నదుల నుంచి దిగువ ప్రాంతాలకు కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వడమే సరైన విధానమని, దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కోదండరాం చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిపుణులు రూపొందించిన ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్.. భారీ ఖర్చుతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. మల్లన్నసాగర్ తోనూ భవిష్యత్లో ప్రమాదాలు ఎదురవుతాయని కోదండరాం తెలిపారు. ఇది కాళేశ్వరం అక్రమాలను బయట పెట్టే ప్రజెంటేషన్ మాత్రమే కాదని, అవినీతితో అక్రమంగా కూడబెట్టిన కోట్లాది రూపాయలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్న వారిని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చే ప్రయత్నమని కోదండరాం చెప్పారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతారా?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రజల తీర్పును స్వీకరించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని సీనియర్ నేతలు వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అని నిలదీశారు. ‘తమ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి తమదే రాజ్యం అనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కూల్చుతామనడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇలాంటి రాజకీయాలు పోవాలి’ అని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement