Sunday, May 5, 2024

తలసేమియాతో బాధపడుతున్న కుమార్తె కోసం ఎముక మజ్జను దానం చేసిన మాతృమూర్తి

హైదరాబాద్: తలసేమియా మేజర్ – క్లాస్ 3తో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెకు ఓ తల్లి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ను దానం చేసింది. వైజాగ్‌కు చెందిన రోగి తన 8 నెలల వయస్సు నుండి సాధారణ రక్తమార్పిడి, చీలేషన్ థెరపీలో ఉన్నారు. రోగిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) కి చెందిన పీడియాట్రిక్-హెమటో-ఆంకాలజిస్ట్, బీఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ సీఎస్.రంజిత్ కుమార్ కు రెఫర్ చేశారు. ఆమెను పరీక్షలు చేసిన తర్వాత, హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆమె తల్లి (32 ఏళ్ల వయస్సు) ని దాతగా సిఫార్సు చేశారు.

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ… భారత్‌లో బీఎంటీని కోరుకునే రోగుల సంఖ్య గత ఐదేళ్లలో పెరిగిందన్నారు. పీడియాట్రిక్ బీఎంటీ ఫలితాలను మెరుగు పరచడానికి అత్యంత అనుభవజ్ఞుడైన పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజిస్ట్ అవసరమన్నారు. విస్తృత స్థాయి శిక్షణ, మెరుగైన అనుభవం, అత్యాధునిక సాంకేతికత మద్దతు కలిగిన ఏఓఐ సంక్లిష్టమైన పీడియాట్రిక్ బీఎంటీ కేసులకు సైతం చికిత్స అందించే నిపుణుల బృందాన్ని కలిగి ఉందన్నారు.

ఏఓఐ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎస్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ… భారతదేశంలో రక్త క్యాన్సర్, తలసేమియా లేదా అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా, ప్రైమరీ ఇమ్యునో డెఫిషియెన్సీ డిజార్డర్స్‌తో బాధపడుతున్న రోగులకు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే ప్రాణాలను కాపాడే చికిత్స అన్నారు. బీఎంటీ చేయించుకుంటున్న రోగి ఆరోగ్యంగానే వున్నారని, ఎటువంటి రక్తమార్పిడి జరగలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement