Saturday, May 18, 2024

AP: జగన్ సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు.. రాజ్ నాథ్ సింగ్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఆదివారం కడపలో రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏపీ నుంచే డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక మోదీ ప్రభుత్వం లక్ష్యమని ఉద్ఘాటించారు. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకుండా పోతుందని విమర్శించారు. ఆ పార్టీని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు.

దేశంలో మోదీ విశ్వ గురుగా అవతరించి పాలిస్తున్నారని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రపంచం స్వాగతిస్తోందని చెప్పారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో లేక ముందు భారత్ 11వ స్థానంలో ఉండేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. నేడు ప్రపంచంలో మన దేశం మూడో స్థానానికి చేరడంతో మోదీ కృషి ఎనలేనిదని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో 25 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే.. కేవలం ఇండ్ల స్థలాలు ఇచ్చి ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతులు దులుపుకున్నారని విరుచుకుపడ్డారు.

కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం ఉచితంగా అందిస్తుందని గుర్తుచేశారు. పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. గడిచిన పదేళ్లలో బీజేపీ మంత్రుల్లో ఏ ఒక్కరిపై కూడా ఆరోపణలు లేవని.. అదే తమ ప్రభుత్వ విధానమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఒకే దేశం, ఒకే జెండా అనేది తమప్రభుత్వ నినాదమన్నారు. జమ్మూ – కాశ్మీర్ సాధించడం తమ ప్రభుత్వంతోనే సాధ్యమయిందన్నారు.

- Advertisement -

అయోధ్య రామ మందిరం హిందువుల 500 ఏళ్ల కల అని.. ఆ కలను మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని వివరించారు. రామరాజ్యాన్నీ సాధించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పుకొచ్చారు. కుల, మతాలకు అతీతంగా మోదీ పాలన చేస్తున్నారని చెప్పారు. దేశంలో త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనార్టీ నారీమణులకు గొప్ప వరమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రూ. 58 వేల కోట్లతో దేశంలో నేషనల్ హై వే రోడ్లు నిర్మించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement