Friday, May 3, 2024

రేపటితో మినీ పోల్స్ ప్రచారానికి తెర..

హైదరాబాద్‌, : రాష్ట్రంలోని ఏడు పురపాలికలకు ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా, మంగళవారంతో ప్రచారానికి తెరపడనుంది. కరోనా నేపథ్యంలో 72గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు సిద్దిపేట, నకిరేకల్‌, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీల ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. ఆయా జిల్లాల మంత్రులు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, స్థానిక ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌లు గట్టిగా శ్రమిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ గత రెండురోజులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపునకు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వవిప్‌ రేగాకాంతారావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం రేగా కాంతారావు 30, 34, 53 డివిజన్లలో ప్రచారం చేశారు. ఇక ఖమ్మంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తుండగా, ఖమ్మంలో సత్తా చాటాలని తపిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి తరుణ్‌ చుగ్‌ పలు మునిసిపాలిటీలలో ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే రఘునందన్‌ బీజేపీ గెలుపుకు ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేటను స్వీప్‌ చేయాలన్న పట్టుదలతో మంత్రి హరీష్‌రావు పనిచేస్తున్నారు. ఏడు మునిసిపాలిటీలలో ప్రచారం పతాకస్థాయికి చేరగా.. సోమ, మంగళవారాల్లో ఇది ముగియనుంది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడంతో నేతలు ప్రచారంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు కూడా కరోనా దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం లేదు. డివిజన్లలో తక్కువ ఓటర్లు ఉండడంతో.. గడపగడప ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఫోన్లు, వాట్సాప్‌, ఇతర డిజిటల్‌ మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement