Thursday, May 2, 2024

Free internet: మేడారంలో ఫ్రీ ఇంట‌ర్నెట్… సిగ్న‌ల్స్ కోసం తొమ్మిది ట‌వ‌ర్లు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర. నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న‌ ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి దాదాపు కోటిన్న‌ర మంది భక్తుల వస్తారని అంచనా.

ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో ముఖ్యం కానున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ నుంచి ఇంటర్నెట్, వైఫై సేవలు చాలా కీలకం.. కాగా, సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేక అక్కడికి వెళ్లే భక్తులకు తరచూ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీంతో ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేడారం మహాజాతరలో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించేందుకు కసరత్తు చేస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఇప్పటికే యాక్షన్ స్టార్ట్ చేసింది.

- Advertisement -

అదనంగా తొమ్మిది చోట్ల టవర్లుమేడారం మహాజాతర అటవీ ప్రాంతం నడి మధ్యలో జరుగుతుంది. ఇక్కడి భక్తులకు సేవలందించేందుకు ప్రైవేటు సంస్థలకు చెందిన ఒకట్రెండు టవర్లు ఉండగా.. బీఎస్ఎన్ఎల్ గతంలోనే ఐదు చోట్లా టవర్లను ఏర్పాటు చేసింది. వరంగల్ నుంచి మేడారం వెళ్లే మార్గంలోని పస్రా, వెంగళాపూర్, ప్రాజెక్టునగర్, నార్లాపర్, మేడారం ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ వద్ద పర్మినెంట్ స్ట్రక్షర్లు ఏర్పాటు చేసింది. వనదేవతలను దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అక్కడ సిగ్నలింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. వరంగల్ నుంచి మేడారం వరకు సెల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు తలెత్తకుండా మరో తొమ్మిది చోట్లా తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వరంగల్ నుంచి మేడారం వరకు సిగ్నల్స్ అంతరాయం కలగకుండా గట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు వీటిని అమర్చే ప్రయత్నాల్లో ఉంది.

తాత్కాలిక ట‌వ‌ర్ల ఏర్పాటు..

ఇందులో ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం, ఊరట్టం క్రాస్ రోడ్డు, కొత్తూరు, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కాజ్ వే, మేడారం సమ్మక్క గద్దెలు, ఆర్టీసీ బస్టాండ్, గెస్ట్ హౌజ్ వద్ద ఈ తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు దానిని సంబంధించిన పనులు పూర్తయినట్లుగా బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ టవర్ల ద్వారా 2జీ, 3జీ సేవలు నిరంతరాయంగా అందించనున్నట్లు పేర్కొంటున్నారు.

16 ప్రదేశాల్లో హాట్ స్పాట్ సెంటర్లు

భక్తులకు ఇంటర్నెట్ సేవలను అరచేతిలోకి తెచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ మేడారం మహాజాతరలో 16చోట్ల హాట్ స్పాట్ సేవలను అందుబాటులోకి తెచ్చే పనులు చేప‌డుతోంది. ఈ మేరకు ములుగు ఎంట్రన్స్ లోని గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్‌, కొత్తూరు స్కూల్‌, ఊరట్టం క్రాస్ రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం స్కూల్‌, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రుల వద్ద ఒక్కొక్కటి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, మేడారం అమ్మవారి గద్దెల ప్రాంతాల్లో హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆయా సెంటర్ల వద్ద పనులు కూడా పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాట్ స్పాట్ సెంటర్లకు వంద అడుగుల లోపు ఏ నెట్ వర్క్ వినియోగదారులైనా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలు వినియోగించుకోవచ్చు. 10 నుంచి 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వన్ జీబీ వరకు డేటా వాడుకోవచ్చు. గత జాతర సమయంలో ప్రభుత్వం ఈ ఉచిత వైఫై సేవల కోసం సుమారు రూ.20 లక్షల వరకు కేటాయించగా ఈసారి కూడా అంతే నిధులతో సేవలందించేందుకు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

15 నుంచి 25వ తేదీ వరకు సేవలు

మహాజాతర మేడారంలో ఈ నెల 15వ తేదీ నుంచి బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగనుండగా.. జాతర పూర్తిగా ముగిసే 25వ తేదీ వరకు వైఫై సేవలు అందుబాటులో ఉండనున్నాయి. బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన అన్ని రకాల సేవలను పర్యవేక్షించేందుకు మూడు టీములను కూడా ఏర్పాటు చేశారు. ఆయా బృందాల్లో 20 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ కనెక్టివిటీ, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించనున్నారు. మేడారం జాతరలో ఫ్రీగా బీఎస్ఎన్ఎల్ సిమ్లు కూడా అందజేయనున్నారు. వాటిని రూ.249 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 45 రోజుల పాటు ప్రతి రోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ సేవలు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement