Sunday, May 12, 2024

ఉచితంగా బీపీ, షుగర్‌ మందులు.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దీర్ఘకాలిక, అసంక్రమిత (బీపీ, షుగర్‌) వ్యాధిగ్రస్థులకు క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో ఉచితంగా మందులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థుల వివరాలను ఇటీవలే వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలోని బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల ఓ సర్వేను నిర్వహించింది. సర్వేలో రాష్ట్రంలో 20 లక్షల మందికి బీపీ, మరో 7 లక్షల మందికి షుగర్‌ ఉన్నట్లు తేలింది. ఇక మీదట వీరికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేయబోతోంది. నెలకు సరిపడా మందులను ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం రోగి ఇంటి వద్దనే ఉచితంగా అందించనుంది. బీపీ, షుగర్‌ పేషెంట్లు ప్రస్తుతం ప్రయివేటు మెడికల్‌ షాపుల్లో మందులను కొనుగోలు చేస్తున్నారు. ఉచితంగా బీపీ, షుగర్‌ మందుల పంపిణీ పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ విధి విధానాలను ఖరారు చేస్తోంది. ప్రతి నెలా ప్రయివవేటులో బీపీ, షుగర్‌ పేషెంట్లు వేలకు వేలు వెచ్చించి మందులను కొనుగోలు చేస్తున్నారు.

అయితే ఎక్కువ మంది పేషెంట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, అందులోనూ వారు పేద వాళ్లు కావడంతో ప్రతి నెలా ప్రయివేటులో మందుల కొనుగోలు ఆర్థికంగా ఎంతో కష్టమవుతోంది. దీంతో చాలా మంది గ్రామీణ ప్రాంత రోగులు బీపీ, షుగర్‌ మందులను కొనుగోలు చేయటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీపీ, షుగర్‌ వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీపీ, షుగర్‌ పరీక్షలను నిర్వహించనుంది. 40 ఏళ్లు దాటిన వారందరికీ క్రమం తప్పకుండా బీపీ, షుగర్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా బీపీ, షుగర్‌ మందుల కిట్లను పంపిణీ చేస్తారు. ఇందుకు పీహెచ్‌సీ స్థాయిల వారీగా రోగులను గుర్తిస్తారు. పీహెచ్‌సీ వారీగా రోగుల జాబితాను పూర్తి చేసి ఆశాలు, అంగన్‌వాడీల సహకారంతో ఉచితంగా బీఫీ, షుగర్‌ మందులను పంపిణీ చేయనున్నారు.

క్రమం తప్పకుండా మందులు వాడకపోతే ప్రమాదం: డా. కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి
సాధారణం గా బీపీ, షుగర్‌ పేషెంట్లు క్రమం తప్పకుండా ప్రతి రోజూ మందులను వాడాల్సి ఉంటుందని, లేనిపక్షంలో వ్యాధి ముదిరి ప్రాణాలకే ప్రమాదమని నిజామాబాద్‌ వైద్య కళాశాల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డా. కిరణ్‌ మాదల చెబుతున్నారు. చాలా మంది బీపీ, షుగర్‌ రోగులు ఆర్థిక ఇబ్బందులతో క్రమం తప్పకుండా మందులు కొనుగోలు చేయటం లేదని, దాంతో నరాలు చిట్లిపోవటం, గుండెపోటు వంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బీపీ, షుగర్‌ మందుల పంపిణీ పై కసరత్తు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement