Sunday, April 28, 2024

ఇంటర్‌ పాసైతే చాలు, పైకోర్సుల్లో సీటు.. ఎంసెట్‌, లా, ఎంబీఏ, ఎంసీఏలో అడ్మిషన్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధన నుంచి అభ్యర్థులకు మినహాయింపునిచ్చింది. మినిమమ్‌ పాస్‌ మార్కులతో ఇంటర్‌ పాసైన వారికి కూడా ఎంసెట్‌, ఐదేళ్ల లాసెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతినిచ్చింది. గతేడాది కూడా కరోనా కారణంగా మినహాయింపు ఇచ్చిన విద్యాశాఖ అదే నిబంధనను త్వరలో జరిగే ప్రవేశ పరీక్షల్లోనూ ఇవ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు అర్హత సాధించాలంటే ఇంటర్‌లో రిజర్డ్వ్‌ కేటగిరీ వాళ్లకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన ఉంది. అలాగే ఇంటర్‌(10 ప్లస్‌ 2) అర్హతతో ఐదేళ్ల లాకోర్సు, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏకు అర్హత సాధించాలన్న కూడా ఇంటర్‌లో 40 నుంచి 45 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సైతం ఈ నిబంధలను ఎత్తివేస్తూ విద్యార్థులకు ప్రవేశాల్లో అవకాశం కల్పించనున్నారు. ఇంటర్‌లో 35 శాతం మార్కులు వచ్చిన వారికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయంతో లాభం చేకూరనుంది. ఇలాంటి వారందరికీ ఎంసెట్‌, లాసెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాల తర్వాత ర్యాంకులను కేటాయించనున్నట్లు సమాచారం. అయితే ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు అర్హత సాధించాలంటే ఉన్న మినిమం మార్కుల నిబంధన బీ-ఫామ్‌, బీటెక్‌ (బయోటెక్నాలజీ), ఫార్మ్‌-డి కోర్సులకు లేదు. వాటికి ఇంటర్‌లో కేవలం పాసై ఉండి, ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎంసెట్‌తో పాటు ఇతర అన్ని సెట్స్‌ల పరీక్షల తేదీలను ఖరారు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమావేశం కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement