Saturday, April 27, 2024

జూనియర్ డాక్టర్ల సమ్మెకు ఈటల మద్దతు

పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇవాళ్టి నుంచి సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. అయితే జూడాల సమ్మతో ప్రజలు ఇబ్బంది పడతారని అన్నారు.  సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు. జూడాలు ప్రాణాలకు తెగించి ప్రాణాలను కాపాడారని ఈటల చెప్పారు.  జూనియర్ డాక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, పెంచిన స్టైఫండ్ ను వెంటనే అమలు చేయాలి ఈటల డిమాండ్ చేశారు.

కోవిడ్‌ ఉద్ధృతి సమయంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇవాళ్టి నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు సమ్మె నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం తెపింది. సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించిన సందర్బంలోనూ జూడాల సమస్యలు పరిష్కరానికి కృశి చేస్తామని చెప్పారని జూడా ప్రతినిధులు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత నేపధ్యంలో కొవిడ్ యేతర సేవలకు సంబంధించిన వార్డుల్లోనూ రద్దీ కొనసాగుతోంది. రోజు వారి అవుట్ పేషంట్ల విభాగాలు సైతం కిటకిటలాడుతున్నాయి. జూనియర్ డాక్టర్లు సమ్మెతో గందరగోళం ఏర్పడింది. రెండురోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 28 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో జూడాల సేవలే కీలకంగా ఉన్నాయి.

వరంగల్ ఎంజీఎంలోనూ జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించాలని జూడాలు నిర్ణయించారు. పెంచిన స్టైఫండ్‌, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement