Monday, April 29, 2024

ధరణిపై 1న కీలక భేటీ.. వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న సీఎస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణిలో మరింత సౌలభ్యత దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జూలై 1న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ అయ్యాయి. సమస్యలపై సమగ్ర సమాచారం కోరుతూ ప్రతిపాదనలతో సిద్దంగా ఉండాలని సమాచారం పంపారు. భూ యాజమాన్య హక్కుల కల్పన, వివాదాలు రెవెన్యూ శాఖ పరిధినుంచి, భూ సమస్యల పరిష్కారం అంతా కలెక్టర్ల చేతుల్లోకి చేరింది. గ్రీవెన్స్‌లను మీ సేవ, వాట్సాప్‌, మెయిల్‌లలో ప్రజలు కలెక్టర్లకు పంపిస్తూ వాటి పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. ధరణి పోర్టల్‌తో అనేక రకాల సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించే యంత్రాంగం కలెక్టర్లేనని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అచ్చుతప్పులు, యాజమాన్య హక్కులు మారినా పాత యజమానుల పేర్లే రికార్డుల్లో చేర్చడం, అవే ఆన్‌లైన్‌లో కనిపించడం సాధారణమైంది. కులం, లింగ తేడాలు, సర్వే నెంబర్ల తప్పులు, ఊర్ల పేర్లు తప్పులు, విస్తీర్ణం ఎక్కువ తక్కువల వంటి అనేక లోపాలు తీరడంలేదు.

ధరణి సమస్యలను నివారించి మరింత సౌకర్యవంతంగా రైతాంగానికి మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ తాజాగా సీఎస్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు సీసీఎల్‌ఏ కార్యాలయం కలెక్టర్లకు సమాచారం అందించింది. జిల్లా, మండలా, గ్రామం, సర్వే నెంబర్‌, ప్రభావిత విస్తీర్ణం, ఎందరు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు… సమస్య, పరిష్కారం వంటి వివరాలతో కూడిన ప్రొఫార్మా కలెక్టర్లకు చేరింది. వీటిపై వచ్చే నెల 1న చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement