Friday, June 18, 2021

వడ్లకు బదులు నేతలను కొంటున్నారు: కోమటిరెడ్డి

రాష్ట్రంలో ఐకేపీ సెంట‌ర్ల వ‌ద్ద ధాన్యం కొనుగోలు చేయాల్సిన టీఆర్ఎస్ స‌ర్కార్ నెల రోజులుగా ప‌ట్టించుకునే పాపాన పోవ‌ట్లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన‌ సివిల్ స‌ప్లై శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ హుజురాబాద్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కొనే పనిలో ప‌డ్డార‌ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ, ఎన్నిక‌లు, ఎదురు తిరిగిన నేత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం త‌ప్ప రాష్ట్రంలో ప్ర‌జ‌లు, రైతులు ప‌డుతున్న క‌ష్టాలు ప‌ట్ట‌వ‌ని ఎద్దేవా చేశారు. రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంట‌ర్ల‌కు తీసుకువ‌చ్చి నెల రోజులు గ‌డుస్తున్న‌ వారిని స‌ర్కార్ ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు. దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. నెల రోజుల‌గా ధాన్యం ఎండకు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. కొట్టుకుపోతున్న‌ స‌రే ప్ర‌భుత్వ పెద్ద‌ల మ‌న‌సు క‌ర‌గ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తేమ ఉంద‌ని, తాలు శాతం ఎక్కువ‌గా ఉంద‌ని రైస్ మిల్ల‌ర్లు కావాల‌ని ధాన్యం కొన‌ట్లేద‌ని తెలిపారు. అలాగే కిందిస్ధాయి సిబ్బంది రైస్ మిల్ల‌ర్ల‌తో కుమ్మ‌క్కై రైతుల‌ను నిలువున దోపిడీ చేస్తున్న ప‌ట్టించుకోవ‌ట్లేదని విమ‌ర్శించారు. కిందిస్థాయి సిబ్బంది, రైస్ మిల్ల‌ర్లు, ట్రాన్స్‌పోర్ట్ ప్ర‌తినిధులు కలిసి రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ 70 శాతం మంది రైతులు ధాన్యం తీసుకువ‌చ్చి రోడ్ల మీద‌నే ప‌డిగాపులు కాస్తున్నార‌ని వివ‌రించారు. దేశానికి తిండి పెడుతున్న రైత‌న్న నోట్లో మ‌ట్టి కొట్టే విధంగా స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తే చూస్తు ఉరుకోమ‌ని హెచ్చ‌రించారు.

రైతుల‌ను న్యాయం జ‌రిగే వర‌కు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే త‌డిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంట‌ర్ల వ‌ద్ద నెల రోజులుగా ప‌డిగాపులు కాస్తున్న రైతుల ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవ‌డంతో క‌రోనా చికిత్స‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడిపై స‌ర్కార్ మీన‌మేషాలు లెక్కిస్తుంద‌న్నారు. అలాగే ధాన్యం కొనుగోలుకు కృషి చేయాల్సిన పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉన్న లేన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రైతుల ధాన్యం ద‌గ్గ‌రుండి కొనాల్సింది పోయి హుజురాబాద్‌లో ఈటెల మ‌నుషుల‌ను కొనే ప‌నిలో ప‌డ్డార‌ని తెలిపారు. వీటితో పాటు స‌ర్కార్ వేసిన క‌రోనా టాస్క్‌ఫోర్స్ టీం స‌మావేశాలు పెట్టుకోవడానికే త‌ప్ప క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ఇబ్బందుల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదని విమ‌ర్శించారు. రాష్ట్రంలో క‌రోనా చికిత్స‌కు బెడ్లు దొర‌క‌క‌.. మందులు బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లుతున్న స‌ర్కార్ త‌మ‌కు వ‌చ్చే క‌మీష‌న్ల కోసం మిన్న‌కుండి పోయింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News