Monday, April 29, 2024

Breaking: హనుమకొండకు ​చేరిన సీఎం కేసీఆర్​.. రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే!

ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండకు చేరుకున్నారు. ఇవ్వాల (శనివారం) సాయంత్రం రోడ్డు మార్గంలో బైలెల్లిన ఆయన కొద్దిసేపటి క్రితమే హనుమకొండ జిల్లాకు వచ్చారు. రాత్రికి హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బసచేసి, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచే తన పర్యటనను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్​. ఇక.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద నష్టాన్ని సీఎం పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

సహాయక చర్యలపై వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి కష్టాలను సీఎం కేసీఆర్​ తెలుసుకోనున్నారు. అట్లనే సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జరీ చేసే చాన్స్​ ఉంది. అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర అధికారులున్నారు.

ఇక, వారం రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ.. భద్రాచలం వద్ద మాత్రం గోదావరిలో వదర ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇవ్వాల ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71.00 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరిలో 24,29,246 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరివాహక ప్రాంతంలోని వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement