Sunday, April 28, 2024

Clay Idols – మట్టి గణపతులను పూజించండి…భ‌క్తుల‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విన‌తి

మహబూబ్ నగర్, ఆగస్టు 22 (ప్రభ న్యూస్): మానవ మనుగడ పచ్చదనంతో అల్లుకుని ఉన్నదని ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అవసరమని అందుకోసం మొక్కలు నాటాలని.. కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని రాష్ట్ర, ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ప్రస్తుత తరాలతో పాటు భావి తరాల కోసం ఈ ప్రకృతి ఉద్యమాన్ని దిగ్విజయంగా చేపట్టాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్ శివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన “పాలమూరు మట్టి వినాయకులు” స్టాల్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం ఏర్పడుతుందని, దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రకరకాల రసాయనాలతో కూడిన రంగులు, ఇనుము, నీటిలో కరగని పదార్ధాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలతో నీరు కలుషితం అవుతుందన్నారు. చెరువు మట్టి, బంక మట్టితో తయారు చేసిన వినాయకులతో నీరు శుద్ధి కావడంతో పాటు నీటిలోని చేపలు, ఇతర ప్రాణులకు ఎలాంటి హాని ఉండదని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడంతో పాటు మట్టి వినాయకుల వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పాలమూరు మట్టి వినాయకులు పేరిట ఏటా మట్టి గణపతులను తయారు చేస్తున్న శ్రీకాంత్ చారిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తిరుపతమ్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నవకాంత్ తదితులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement