Wednesday, May 22, 2024

Big Story: రికార్డుల యోగి, ఆ ముగ్గరిలో ఒకడిగా.. 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేనే సీఎం..

దేశంలోని అతిపెద్దది, జాతీయ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజా ఎన్నికల్లో రికార్డుల మోత మోగించారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్రను తిరగరాశారు. రాజకీయాల్లో బుల్డోజర్‌గా పేరుతెచ్చుకున్న ఆయన విపక్షాలను తొక్కిపడేసి విజయంలో తనదైన ముద్రవేశారు. హేమాహేమీల్లాంటి నేతలకు సాధ్యంకాని ఫలితాలను సాధించి ఔరా అన్పించారు. ఆ రికార్డులు ఇవీ…

ఉత్తర ప్రదేశ్‌లో గడచిన 70 ఏళ్లలో 21 మంది ముఖ్యమంత్రులు అధికారం చేపట్టారు. అయితే పూర్తికాలం ఐదేళ్లూ సీఎంగా వ్యవహరించిన వ్యక్తులు కేవలం ముగ్గురే. ఆ ముగ్గురిలో యోగి ఆదిత్యనాథ్‌ ఒకరు. సుస్థిరమైన, తనదైన ముద్రవేస్తూ పాలన పగ్గాలు సమర్థంగా నడిపిన యోగి తాజా ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టారు. అంతకుముందు 2007-12 మధ్యకాలంలో బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఆ తర్వాత 2012-17 సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సీఎంలుగా పూర్తికాలం సేవలందించారు. వీరి తర్వాత యోగి అధికారంలోకి వచ్చి ఐదేళ్లూ సీఎంగా పనిచేశారు.

15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే సీఎం..
ఉత్తర్‌ప్రదేశ్‌కు గడచిన పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారంతా ఎమ్మెల్సీలుగానే ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర సారథిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్ల క్రితం తొలిసారి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన యోగి ఆదిత్యనాథ్‌ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ఎమ్మెల్సీలుగానే ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఇప్పుడు గోరఖపూర్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసి తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన యోగి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అదే జరిగితే, 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రికార్డు ఆయన సొంతం అవుతుంది.

37 ఏళ్ల తర్వాత మళ్లీ
ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. గడచిన 37 ఏళ్లలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఆ సంప్రదాయాన్ని ఛేదించిన యోగి తన పార్టీకి విజయాన్ని దక్కేలా చేశారు. 1985లో ఎన్‌డీ తివారీ ఉమ్మడి యూపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్‌ పార్టీకి రెండోసారి అధికారం చేజిక్కేలా చేశారు. ఆ తరువాత మరెవ్వరూ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు యోగి సారథ్యంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు సంపూర్ణానంద (1957), చంద్రభానుగుప్త (1962), హేమావతి నందన్‌ బహుగుణ (1974) లు మాత్రమే అధికారాన్ని నెలబెట్టుకోగలిగారు.

రెండోసారి సీఎం అయితే.. అదో రికార్డు
తిరుగులేని విజయం నేపథ్యంలో మరోసారి యోగి ఆదిత్యనాథ్‌ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టే అవకాశాలే ఎక్కువ. అనుకోని పరిణామాలు సంభవిస్తే తప్ప, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అదే జరిగితే ఆయన పేరిట మరో రికార్డు నమోదు అవుతుంది. యూపీలో బీజేపీ తరపున పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరూ రెండోసారి అధికారం చేపట్టలేకపోయారు. యూపీలో ఇప్పటివరకు నలుగురు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. కల్యాణ్‌సింగ్‌, రామ్‌ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌లు ఇప్పటివరకూ సీఎంలుగా పనిచేశారు. కానీ యోగికి మాత్రమే రెండోసారి చాన్స్‌ రాబోతోంది.

నోయిడా మూఢనమ్మకాన్ని ఛేదించి
రాజకీయాల్లో నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కువే. కొన్ని ప్రదేశాలను సందర్శిస్తే అధికారం చేజారిపోతుందన్నది అలాంటి నమ్మకాల్లో ఒకటి. న్యూఢిల్లిdకి సమీపంలోని నోయిడాను సందర్శిస్తే అలాంటి సమస్యే ఎదురవుతుందని చాలామంది నేతలు భయపడుతూంటారు. 1980 దశకంలో అప్పటి సీఎంలు ఎన్‌డీ తివారి, వీరభద్రసింగ్‌ నోయిడాకు వెళ్లివచ్చాక అధికారం కోల్పోయారని చెబుతూంటారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌కు ఆ నమ్మకం కాస్త జాస్తీయే. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఏనాడూ నోయిడా ప్రాంతంవైపు కన్నెత్తి చూడనేలేదు. కానీ, అందుకు భిన్నంగా యోగి ఆదిత్యనాథ్‌ 2018లో నోయిడా సందర్శించారు. ఆ సందర్భంలో అఖిలేష్‌ చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. మునుముందు యోగి తగిన ఫలితాన్ని పొందుతారంటూ అఖిలేష్‌ నర్మగర్భితంగా చేసిన వ్యాఖ్య తప్పని ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన యోగి నిరూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement