Tuesday, April 30, 2024

TS | సీపీ రంగానాథ్ పై వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న పోలీసు అధికారుల సంఘం

పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో జైలుకు వెళ్లి ఇవ్వాలే బెయిల్ పై బయటికి వచ్చారు బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పై వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ కేసు విషయంలో పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రమాణం చేయాలని బండి అనడాన్ని పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. తాము అధికారంలో చేరినప్పుడే ప్రమాణం చేస్తామని, తమకు కేసు రీత్యానే కానీ, వ్యక్తులతో ఎలాంటి రాగద్వేషాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల సంఘం బండి సంజయ్ ని తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆ వివరాలు వారి మాటల్లోనే.

– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ

పేపర్ లీకేజీ కేసులో ఇవ్వాల (శుక్రవారం) ఉదయం బెయిల్ పొందిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ని వ్యక్తిగత దూషణ చేయడం సరికాదు. ఏ పోలీసు ఉద్యోగి, ఏ కేసులోనూ ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మేము విధుల్లో చేరేటప్పుడే నిజాయితీతో,  నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవచేస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. అలాంటిది కమిషనర్ ని ప్రమాణం చేయమని అడగడం అసంబద్ధమైన విషయం.

వరంగల్ కమిషనర్ గా ఉన్న రంగనాథ్ పనితీరును గతంలో తాను పనిచేసిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని సామాన్య ప్రజానీకాన్ని అడిగినా తెలుస్తుంది. లేదంటే ఆయా జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగినా వాస్తవాలు తెలుస్తాయి. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సామాన్య ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా పరిష్కరిస్తున్న తీరు యావత్ రాష్ట్రం గమనిస్తుంది. సమస్యలనుండి విముక్తి అయిన ప్రజానీకం పోలీసులకు, పోలీసు వ్యవస్థకు పాలాభిషేకాలతో బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులపై విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. సీపీ రంగనాథ్ తన కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన, సంచలనాత్మకమైన కేసులను పరిష్కరించిన విషయం తెలంగాణ, ఏపీ ప్రజలందరికీ సుపరిచితమే.

ఈ కేసుకు సంబంధించి మీకున్న సందేహాలను విచారణలో భాగంగా నివృత్తి కోరవచ్చు. పోలీసు వ్యవస్థ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తుంది. దీనికి సంబంధించిన మీ అభ్యంతరాలను న్యాయస్థానాల్లో తేల్చుకోవాలిగాని, చట్టబద్దంగాని ప్రమాణాలను చేయమని కోరడం అశాస్త్రీయం, అసంబద్ధం. పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే మీ వైఖరిని మార్చుకోవాలని, పోలీసు కమిషనర్ రంగనాథ్ మీద చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి మీడియాకు పంపిన లేఖలో వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement