Wednesday, May 8, 2024

తిరుపతిపై పార్టీల గురి..వ్యూహాలకు పదును!

ఏపీలో తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ రావు ఆకస్మిక మరణంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ అభ్యర్దిగా డాక్టర్  గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ రంగంలో దిగారు.

ఏప్రిల్ 17న జరగనున్న ఉపఎన్నికకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ ఎంత ఉండాలనేదానిపై అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దృష్టి సారిస్తుంటే..ఎలాగైనా అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించి పాగా వేయాలని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల గెలుపు మంచి జోష్ లో ఉన్న అధికార వైసీపీ..తిరుపతి స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటి పార్టీ సీనియర్ నాయకులకు పార్టీ అధినేత, సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు.

మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికను సవాల్ తీసుకుంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో డీలాపడిన టీడీపీ.. తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నిక లో తెగించి పోరాడాలని.. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రచార సరళిని మార్చిన టీడీపీ అగ్ర నాయకత్వం.. సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన నేతలతో కలిసి ప్రచారం మొదలు పెట్టారు. తిరుపతి ఉపఎన్నిక కోసం పవన్ కల్యాణ్ సైతం ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇరుపార్టీ ఉమ్మడి అభ్యర్థి తరుపున పవన్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తిరుపతి లోక్‌సభ స్థానంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా-నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement