Sunday, November 10, 2024

Rain Alert | ఐఎండీ హెచ్చరిక.. మ‌రో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల నాలుగు రోజులు తెలంగాణ‌లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

- Advertisement -

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. ఇంకా తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో అల‌ర్ట్ కూడా జారీ చేసింది.

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న అధికారులు..

ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కాగా, రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అడపాదడపా వానలు కురుస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు పలు జిల్లాల్లో రైతన్నలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు ఉరుములు మెరుపులతో పిడుగులు పడి, మూగజీవాలు సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి.

ఇవీ అత్యధిక ప్రభావిత ప్రాంతాలు..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఏ ప్రాంతంలో పిడుగు పడబోతుందో ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పిడుగుపాటు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిడుగుపాటుపై అప్రమత్తం చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ మొబైల్స్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపిస్తున్నా, ఆశించిన ఫలితం ఉండటం లేదు. మృతుల్లో రైతులు, రైతు కూలీలే అధికంగా ఉంటున్నారు. అడవులు, వాటి సమీపంలోని మైదానాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement