Sunday, May 5, 2024

Big Story: అదే గందరగోళం.. యాసంగిపై ఎటూ తేల్చని ప్రభుత్వాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన చేసినా రైతుల్లో మాత్రం యాసంగిపై అదే అనుమానం.. ఆందోళన, భయం నెలకొన్నాయి. యాసంగికి సంబంధించి ఎంత కొంటామో.. ఇపుడే చెప్పలేమని కేంద్రం పేర్కొంటుండగా, పంట వేశాక కొనకపోతే తాము ఆగమై పోతామని రైతులు అంటున్నారు. యాసంగి సాగుకు సమయం మించిపో తుండగా, వరిపై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు.. కేంద్రం కొంటామని చెబుతున్నా, ఇంకా ఎంతకొంటామో ఇపుడే నిర్ణయించలేమని చేస్తున్న ప్రకట నలతో ఆరుగాలం కష్టపడి తాము పంట పండించాక అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సేకరించకపోతే, కనీస మద్దతు ధర లభించకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని తెలంగాణ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పింది. కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటిస్తే, తాము కొనమని ఎక్కడా చెప్పలేదని.. టార్గెట్‌ ముందే చెప్పడం సాధ్యం కాదని కేంద్రం అంటోంది. చెప్పిన దానికంటే ఎక్కువే కొంటామంటోంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్లు ఎట్ల కొనరో చూస్తం.. బరాబర్‌ కొనిపిస్తం అని బీజేపీ రాష్ట్ర ఎంపీలు అంటున్నారు. పరస్పర, విరుద్ద గందరగోళ ప్రకటనలతో రాష్ట్ర రైతాంగ పరిస్థితి అమోయమంగా మారింది. గత రబీలో 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అనుకున్నప్పటికీ.. టార్గెట్‌ కంటే ఎక్కువగా 61.87 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని కేంద్రం చెప్పింది. ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించామని.. కానీ పెరిగిన దిగుబడి, మార్కెట్‌లో మిగులును దృష్టిలో పెట్టుకుని టార్గెట్‌ కంటే ఎక్కువ ధాన్యం సేకరించాలని చూస్తున్నామని కేంద్రం సమాధానం ఇచ్చింది. సేకరణ ఎంత పెంచాలన్నది దిగుబడి అంచనాలు, మార్కెట్‌ మిగులు, సాగు తీరు గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. యాసంగికి సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాలతో త్వరలో సమావేశం నిర్వహించి.. ఎంత పంట వేశారు.. ఎంత దిగుబడులు వస్తాయి? అన్న వివరాల ఆధారంగా కొనుగోళ్ళపై ప్రకటన చేస్తామని కేంద్రం అంటోంది. అసలు మీ కొనుగోలు సామర్ధ్యం ఎంత? ఎంత కొంటారో చెబితే.. అంతే పండిస్తాం అని రాష్ట్రం అంటోంది.

ముందస్తు ప్రణాళికలేవీ?
ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్ల రైతు నలిగిపోతున్నారు. ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం కారణంగా వానాకాలం కొనుగోళ్ళ అంశంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పలు చోట్ల ధాన్యం కల్లాల్లోనే కనుమూస్తున్నారు. వానాకాలం పరిస్థితే ఇలా ఉంటే.. యాసంగికి సంబంధించి పంటలు, కొనుగోళ్ళపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలతో భవిష్యత్తుపై రైతుల్లో బెంగ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నీటిసమస్య, కరెంట్‌ సమస్య లేకపోవడం, వరి కొత్తవంగడాలు రావడంతో దిగుబడులు కూడా రికార్డుస్థాయిలో వస్తున్నాయి. పెద్ద ఎత్తున వచ్చే దిగుబడులను నిల్వచేసుకునే సామర్ధ్యం కూడా రైతుల వద్ద లేకపోగా, ఇప్పటికిపుడు పంటల మార్పిడి కూడా సాధ్యం కాకపోవడం.. వరి పండించినంత తేలికగా ఇతర పంటలు పండే అవకాశం లేకపోవడంతో రైతుల్లో యాసంగిపై, భవిష్యత్తుపై ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

- Advertisement -

గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 68.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఒక్క వరి పంటే 52.7లక్షల ఎకరాల్లో సాగయ్యింది. దీంతో ఈ సారి కూడా అదే స్థాయిలో సాగయ్యే పరిస్థితులు ఉంటాయని భావించిన ప్రభుత్వం కొనుగోళ్ళ పరిమితులను దృష్టిలో పెట్టుకుని పంట విస్తీర్ణాన్ని తగ్గించే ప్రచారం ముందుగానే చేపట్టింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటలు తూటాలు పరిస్థితిని గందరగోళంగా మార్చాయి. ఇపుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాసంగి సాగు తర్వాత పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారుతుందోనన్న చర్చ రైతుల్లో జరుగుతోంది. ఆందోళన తొలగించి రైతుకు భద్రత, భరోసా కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement