Wednesday, May 8, 2024

Delhi | హరగోపాల్‌పై కేసు ఉద్యమ ద్రోహమే.. కేసీఆర్ జోక్యం చేసుకోవాలి: సీపీఐ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆయనకు ఎవరితోనూ సంబంధాలు లేవని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన హరగోపాల్‌పై యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పందించాలని అన్నారు. సీఎం జోక్యం చేసుకొని హరగోపాల్ పై ఎలాంటి కేసు లేకుండా చూడాలని నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రిని ఉద్యమ ద్రోహిగా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో ఇలాగే వరవరరావుపై కూడా దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టారని గుర్తుచేశారు.

మరోవైపు మోదీ సర్కారు మహిళలను అవమానిస్తోందని, న్యాయం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని కూడా నారాయణ తప్పుబట్టారు. ఇదిలా ఉంటే బిహార్‌లో జరిగే విపక్షాల సమావేశానికి చిత్తశుద్ధి ఉంటే తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హాజరుకావాలని అన్నారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదని చెబుతున్న గవర్నర్, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్టప్రతిని ఎందుకు పిలవలేదంటే సమాధానం చెప్పలేకపోతున్నారని నారాయణ అన్నారు.

- Advertisement -

ఏపీ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శల గురించి ప్రశ్నించగా.. మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు తప్ప మోదీ సర్కారుకు కట్టు బానిసలా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదులుకుంటారని నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఎవరితో వెళ్లాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement