Tuesday, April 30, 2024

ప్రాజెక్ట్ సందర్శించండి.. ఖర్చులు మావే.. ఎన్జీటీని ఆశ్రయించిన తెలంగాణ

ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదంపై  మాటల తూటాలు పేలుతుండగా.. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఏపీ సర్కారుపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే అధికారులను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్జీటీ బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్జీటీ బృందం పర్యటనకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపింది. ఎన్జీటీ బృందం పర్యటనకు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి వివాదాలపై కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ మ‌రో లేఖ రాశారు. ఈ నెల 9న త‌ల‌పెట్టిన త్రిస‌భ్య క‌మిటీ భేటీ వాయిదా వేయాల‌ని బోర్డుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ త‌ర్వాత పూర్తి స్థాయి బోర్డు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌ల‌ విద్యుత్ ఉత్ప‌త్తి ఆపాల‌న్న ఏపీ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ర‌జ‌త్ కుమార్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ అజెండాను లేఖ‌లో పొందుప‌రిచారు. తెలంగాణ అంశాల‌ను 20వ తేదీ త‌ర్వాత జ‌రిగే బోర్డు స‌మావేశం అజెండాలో చేర్చాల‌ని కోరారు. ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ‌, ఆర్డీఎస్ కుడి కాల్వ ప‌నులు ఆపాల‌న్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా బేసిన్ వెలుప‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఎక్కువ నీటిని త‌ర‌లించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు ఆపండి: కేంద్రానికి సీఎం జ‌గ‌న్ మరో లేఖ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement