Tuesday, April 30, 2024

Big Story: పల్లె, బస్తీ దవాఖానాల్లో డాక్టర్ల కొరత.. ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీకాని పోస్టులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్తగా ఏర్పాటు చేస్తున్న పల్లె, బస్తీ దవాఖానాల్లో సేవలు అందించేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఎంబీబీఎస్‌ వైద్యులు, సిబ్బంది నుంచి స్పందన కనిపించడం లేదు. గ్రామీణ, పట్టణ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పల్లె, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలోని సిద్ధిపేట, వరంగల్‌, మెదక్‌, మంచిర్యాల , జగిత్యాల, నిజామాబాద్‌ కార్పోరేషన్‌, ఆర్మూరు, బోధన్‌ తదితర ముఖ్య నగరాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది.

ఒక్కో పల్లె, బస్తీ దవాఖానాలో ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులతోపాటు ఇద్దరు నర్సులు, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది సేవలందించాల్సి ఉంటుంది. అయితే ఖాళీల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లకు పారామెడికల్‌ సిబ్బంది దరఖాస్తు చేసుకుంటున్నా ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులు మాత్రం ముందుకురావని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లె బస్తీ దవాఖానాలో పనిచేసే వైద్యులకు రూ.40వేల వేతనంమే ఉండడం, పనివేళలు, పనిభారం అధికంగా ఉండడంతోపాటు మారుమూల గ్రామాల్లో పనిచేయాల్సి రావడంతో ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులు ముందుకురావడం లేదని తెలుస్తోంది.

పల్లె, బస్తీ దవాఖనాలతోపాటు వివిధ జిల్లాల్లోని పీహెచ్‌సీల్లోనూ వైద్యుల కొరత వేధిస్తోంది. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్‌ వైద్యులు ఇన్‌సర్వీసులో పీజీ పూర్తి చేసి పదోన్నతిపై వైద్య విధాన పరిషత్‌, వైద్య కళాశాలకు వెళ్లిపోవడంతో పలు చోట్ల పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఉదాహారణకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 32 పీహెచ్‌సీల్లో కనీసం 90మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా కేవలం 38 మాత్రమే ఉన్నారు.

ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఇంటికొకరు మంచం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యం చేయించుకుందామంటే అక్కడ వైద్యుల కొరత వేధిస్తోండడంతో గ్రామీణ ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు లేదంటే సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement