Friday, September 20, 2024

రోడ్డుపాలైన సంపంగి పూలు.. గిట్టుబాటు ధర లేక 7 టన్నుల దాకా పారబోసి రైతుల నిరసన

సంపంగి పూల పరిమళం మామూలుగా ఉండదు కదా.. కానీ, అట్లాంటి పూలను రోడ్లమీద పారబోస్తున్నారు రైతులు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేకపోవడమీ దీనికి కారణంగా చెబుతున్నారు. గత వారం కిలో 70 రూపాయలు ఉన్న సంపంగి పూలకు ఇప్పుడు పది రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని  సత్యమంగళం దాని పరిసర ప్రాంతాల్లోని రైతులు సంపంగి పూల మొక్కలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. వీటిని పెర్ఫ్యూమ్ తయారీకి, పండుగ సందర్భాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

కాగా, తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో దాదాపు ఏడు టన్నుల దాకా సంపంగి పూలను రైతులు రోడ్ల మీద, గుంతల్లో పారబోశారు. సంపంగి పువ్వు ధర గత వారం రూ.70 నుంచి రూ.10కి పడిపోయి రైతులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అందువల్ల మరింత నష్టం జరగకుండా ఉండటానికి వారు దాదాపు ఏడు టన్నుల సంపంగి పువ్వులను పారబోసి నిరసన తెలిపారు.

నష్టాన్ని చవిచూస్తున్న రైతులు..

మార్కెట్‌కు పూలను తీసుకురావాలంటే తెల్లవారుజామున 5 గంటలకే పూలను కోయాల్సి వస్తోందని, ధరలు బాగా పడిపోవడంతో తమ శ్రమ అంతా వృథాగా పోతోందని రైతులు వాపోతున్నారు. కానీ, తమ జీవనోపాధి కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తమ ప్రాంతంలో పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీని స్థాపించి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు రైతులకు మేలు చేసిన వారవుతారని అభ్యర్థించారు. సాధారణంగా పూలను సత్యమంగళం ఫ్లవర్ ప్రొడ్యూసర్స్ సొసైటీకి తీసుకువస్తారు, అక్కడ ధర నిర్ణయించబడుతుంది. తరువాత తమిళనాడులోని వివిధ జిల్లాలకు, కేరళ, కర్నాటకలకు కూడా రవాణా అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement