Saturday, April 27, 2024

కేర‌ళ మంత్రిగా సాజి చెరియ‌న్.. రేపు ప్ర‌మాణ‌స్వీకారం

కేర‌ళ మంత్రిగా సీపీఐ(ఎం) నేత సాజి చెరియన్ రేపు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. చెరియ‌న్ ని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ చేసిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఆమోదముద్ర వేశారు. దాంతో చెరియన్‌ రేపు సాయంత్రం 4 గంటలకు కేరళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాజి చెరియన్‌ గత ఏడాది జూలైలో పథనంథిట్ట జిల్లాలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దాంతో అతనిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఆ కారణంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనను తిరిగి క్యాబినెట్ లోకి తీసుకోవాలని సీఎం పినరయి భావించారు. ఆ మేరకు గత నెల 30న గవర్నర్‌కు అభ్యర్థన పంపారు. సీఎం ప్రతిపాదనపై గవర్నర్‌ సోమవారం అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా సీఎం మళ్లీ అదే ప్రతిపాదన చేయడంతో మంగ‌ళ‌వారం గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఆమోదం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement