Friday, April 26, 2024

తీన్మార్ మల్లన్న అరెస్ట్ కు రంగం సిద్ధం?

చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌  తీన్మార్ మల్లన్న అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. క్యూ న్యూస్ మాజీ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతం విచారణ నిమిత్తం ఆయనను చిలుకలగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మల్లన్న అభిమానులు.. భారీ ఎత్తున చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. 

కాగా, తీన్మార్ మల్లన్న కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్ పిఎస్ 41ఏ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ చానల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత కొన్ని రోజులుగా క్యూ న్యూస్‌ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్‌ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్‌ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లన్న ఆదివారం న్యూస్‌లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్‌ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్‌లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: రేవంత్ హస్తవాసి పనిచేస్తుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement