Friday, April 26, 2024

రేవంత్ హస్తవాసి పనిచేస్తుందా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీఆర్ఎస్ సర్కార్ పై పోరు మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల బలాబలాలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న నాయకులు, వారి బలాబలాలు, పార్టీపరంగా చేయాల్సిన కార్యక్రమాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓటింగ్ తదితర అంశాలపై రేవంత్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్నతొలి ఉపఎన్నిక కావడంతో రేవంత్ రెడ్డికి ఇది సవాల్ గా మారింది. గతంలో సాగర్, దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా రేవంత్ విసృత ప్రచారం నిర్వహించినా.. కాంగ్రెస్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, రేవంత్ పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లను కాదని ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో హుజురాబాద్ ఉపఎన్నిక రేవంత్ కు అగ్ని పరీక్షగా మారింది. ఈ క్రమంలో హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారు? ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల బరిలో ఉండగా.. టీఆర్ఎస్ తరుపున బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నికల పూర్తి బాధ్యతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు రేవంత్ అప్పగించారు. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనదేనని నిర్దేశించారు.

మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికను రేవంత్ లైట్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ లక్ష్యం అంతా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ‘’ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, అదొక ప్రక్రియ… ఆ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని తమ కార్యక్రమాలు, కార్యాచరణలు ఉండబోవు’’ అని రేవంత్ వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీని కోవర్టుల బెడద కూడా వెంటాడుతోంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని బహిష్కరించిన రేవంత్.. పార్టీలో ఉన్న కోవర్టులు బయటకి వెళ్లిపోవాలని హుకుం చేశారు. అయితే, హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కు అనూకులంగా వ్యవహరించే కోవర్టులు ఉన్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. హుజురాబాద్ లో మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ గతం కంటే మంచి ఫలితాలు రాకపోయినా… గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకునైనా నిలబెట్టుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఆలోపు పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవచ్చని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోయిన.. నైతిక విజయం తమదే అన్న సంకేతాన్ని ప్రజల్లో కల్గించాలని రేవంత్ డిసైట్ అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవిపై రగులుతున్న గులాబీ సైన్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement