Tuesday, May 7, 2024

సెంచ‌రీకి చేరువ‌లో ఒమిక్రాన్‌.. దేశంలో వేగంగా విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి..

ఇండియాలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. ప్ర‌స్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య దేశంలో సెంచరీకి చేరువైంది. దీంతో అంద‌రిలోనూ ఆందోళ‌న వ్య‌క్త మ‌వుతోంది. కొత్త‌గా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 6 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 89కి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా మ‌హారాష్ట్రలో 32 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 9, ఢిల్లీలో 10, మహారాష్ట్రలో 32, రాజస్తాన్‌ లో 17, కేరళలో 5, గుజరాత్‌ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.

క‌ర్నాట‌క‌లో కొత్తగా న‌మోదైన ఒమిక్రాన్ కేసుల‌ను ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్యా మంత్రి డాక్టర్ కె సుధాకర్ ధ్రువీకరించారు. అదేవిధంగా తెలంగాణ‌లో కేసుల విష‌యంలోనూ రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు ధ్రువీక‌రిస్తూ మొత్తం 9 కేసులు న‌మోద‌య‌య్యాయ‌ని, వీటిలో ఒక‌రు బెంగ‌ళూరు పారిపోయిన‌ట్టు వెల్ల‌డించారు. దీంతో మొత్తం వేరియంట్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ఐదుగురు వ్యక్తులలో, 4 పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారిలో 19-70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కూడా ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో UK నుండి తిరిగి వస్తున్న 19 సంవ‌త్స‌రాల వ్య‌క్తి ఉన్నాడు. ఢిల్లీ నుంచి తిరిగివ‌స్తున్న ఒక మ‌హిళా, పురుషుడు, నైజీరియా నుండి వ‌స్తున్న మ‌రో ఇద్ద‌రు ఉన్నార‌ని మంత్రి వెల్ల‌డించారు.

కాగా, దేశంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు డిసెంబ‌ర్ 2న క‌ర్నాట‌క‌లోనే న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. మరోవైపు, తెలంగాణ లోనూ ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. వీరిలో ముగ్గురు రోగులు కెన్యా నుండి తిరిగి వచ్చారు. వారు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. నాలుగో వ్య‌క్తి భారతీయ సంతతికి చెందినవాడు. తాజాగా కేసుల‌తో క‌లుపుకుని తెలంగాణ‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 8కి చేరాయి. కాగా, హైద‌రాబాద్‌లోని టోలిచౌకి లోని ఓ పారామౌంట్ కాల‌నీలో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించి త‌గు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నారు.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ మ‌రో 4 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కొత్త కేసులు సంఖ్య మొత్తం 10కి పెరిగింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, “ప్రస్తుతం, తొమ్మిది మంది ఒమిక్రాన్ రోగులు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. ఒక పేషెంట్ ఇంతకు ముందు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుత పేషెంట్లలో ఎవరూ సీరియస్‌గా లేరు” అని వెల్ల‌డించారు. ప్రస్తుతం, 40 మంది కోవిడ్ రోగులు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement