Saturday, April 27, 2024

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సిద్ధూ!

పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు చెక్ పెట్టేందుకు ఆపార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎంగా అమరీందర్ సింగ్ కొనసాగనుండగా.. నవజోత్ సింగ్ సిద్దుకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మ‌రో ఇద్ద‌రు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా నియమించనున్నారు. ఇందులో ఒక‌టి ద‌ళితుల‌కు ఇవ్వాల‌ని అధిష్టానం యెచిస్తోంది.

వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఇద్ద‌రు సీనియ‌ర్ నేతల మ‌ధ్య విభేదాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆందోళ‌న‌కు గురి చేసింది. దీనిపై అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు రాహుల్ గాంధీ అండదండలుండగా, నవజోత్ సింగ్ సిద్ధుకు మద్దతుగా ప్రియాంక గాంధీ ఉంది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాహుల్, ప్రియాంకలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య రాజీ కుదిర్చింది.

ఇటీవల సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై ఆమెకు వివరించారు. అనంతరం అమరీందర్, సిద్ధూల మద్య రాజీకి సోనియా ప్రయత్నించారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని సిద్ధూ ప్రకటించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement