Friday, April 26, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంత్రి జగదీశ్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల చౌటుప్పల్‌ లో రేషన్‌ కార్డుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి జగదీష్‌రెడ్డి చేతిలోని మైక్‌ను రాజగోపాల్‌రెడ్డి లాక్కోవడం వంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఐపీసీ 186, 353, 427సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం మంత్రి జగదీశ్ పై రాజగోపాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన కౌంటర్ ఇచ్చారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజలకు సేవ చేయాలనే సోయిలేదని జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికారిక కార్యక్రమంలో దౌర్జన్యం చేస్తానంటే కుదరదన్నారు. చేతిలో మైకు ఎవరు గుంజుకున్నదన్నది ప్రపంచమే చూసిందని చెప్పారు. పుటకొక్క మాట కోమటిరెడ్డి బ్రదర్స్ కు అలవాటు అని విమర్శించారు. ఎంపీ హోదాలో కోమటిరెడ్డి మునుగోడు లో పర్యటించారా? అని మంత్రి ప్రశ్నించారు. స్వప్రయోజనాల కొరకే పదవులను అడ్డుపెట్టుకున్నారని మండిపడ్డారు.

చిల్లర మాటలు వెకిలి చేష్టలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు సొంతంగా మారాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పూటకో మాట మాట్లాడి ప్రజల్లో వారు పలుచన అయ్యారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మొహం చూపలేకనే మైక్ గుంజుకొనే డ్రామాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెర లేపారని ఆయన అన్నారు. సొంత పార్టీ వేదికల మీద సీనియర్ నేతలను పెద్ద నోరు వేసుకుని దుర్బర్షాలడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు వెన్నెతో పెట్టిన విద్య అని ఆయన ఎత్తి పొడిచారు. ఏడేండ్లుగా రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జిల్లా అభివృద్ధిపై 26 సార్లు సమీక్షలు నిర్వహించారాన్నారు.

త‌మ ప్ర‌భుత్వ ప‌నుల‌ను కానీ అడ్డుకునే శ‌క్తి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు లేద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను క‌న్నెర్ర జేస్తే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బ‌తుకులు బ‌జారున ప‌డుతాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రి వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడ‌లేదని.. త‌న జోలికి కానీ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల జోలికి కానీ వ‌స్తే ఇక ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కోట్ల రూపాయాలు గ‌డించిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.. నేడు పిచ్చి ప్రేలాప‌ణ‌లు చేస్తూ.. పేద‌ల క‌డుపు కొడుతున్నార‌ని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement