Saturday, May 4, 2024

సౌదీలో సామూహిక మరణశిక్ష.. ఒకే రోజు 81 మందికి ఉరి, ఆధునిక చరిత్రలో అతిపెద్ద శిక్ష

సౌదీ అరేబియా ప్రభుత్వం రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. శనివారం ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరితీశారు.ఆధునిక చరిత్రలో ఒకదేశం అమలుచేసిన అతిపెద్ద సామూహిక మరణశిక్ష ఇదేకావడం గమనార్హం. వీరందరూ మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన నేరాలకు పాల్పడినవారే. గతంలో మక్కాలోని గ్రాండ్‌ మసీదును స్వాధీనం చేసుకున్న కేసులో దోషులుగా తేలిన 63 మందికి 1980లో సౌదీ ప్రభుత్వం శిరచ్ఛేదనం అమలుచేసింది. మొన్నటి వరకు ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక. కాగా, ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. శిక్ష అమలైన వారిలో మ#హళలు, పిల్లల్ని చంపిన వారితో పాటు అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు, యెమన్‌లోని #హతీ తిరుగుబాటుదారులకు మద్దతునిచ్చిన వారు కూడా ఉన్నారు. యావత్‌ ప్రపంచం ఉక్రెయిన్‌ -రష్యా ఆందోళనలో ఉండగా, గుట్టుచప్పుడు కాకుండా సౌదీ సామూహిక మరణశిక్షలు అమలుచేసింది.

మరణశిక్షకు గురైన వారిలో 73 మంది సౌదీలు, ఏడుగురు యెమన్‌లు, ఒకరు సిరియన్‌ పౌరుడు ఉన్నట్లు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ నివేదించింది. అయితే ఈ మరణశిక్షలను ఎక్కడ అమలు చేశారన్నది స్పష్టంగా తెలియ రాలేదు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదం, తీవ్రవాదం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సౌదీ ప్రభుత్వం కఠినమైన, తిరుగులేని వైఖరిని కొనసాగిస్తుందని ప్రెస్‌ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. మరణశిక్ష విధించబడిన వారు సాతాను అడుగుజాడల్లో దారుణ నేరాలకు పాల్పడ్డారని సౌదీ స్టేట్‌ టెలివిజన్‌ ప్రకటనలో పేర్కొనబడింది. కాగా ఈ సామూహిక ఉరిశిక్షలు అంతర్జాతీయ విమర్శలకు దారితీశాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం పొరుగున ఉన్న యెమన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 2015 నుంచి ఇరాన్‌ మద్దతుగల హౌతీలతో పోరాడుతోంది.

– 2016లో 47 మందిని ఉరితీసింది. నిరసన ప్రదర్శనలు చేసినందుకు ప్రముఖ ప్రతిపక్ష షియా మతగురువు సహా పలువురి మరణశిక్షకు గురయ్యారు.
– 2019లో 37 మంది సౌదీ పౌరులు శిరచ్ఛేదాన్ని ఎదుర్కొన్నారు. వారిలో ఎక్కువ మంది మైనారిటీ షియాలు. తీవ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలకు వీరు శిక్షకు గురయ్యారు.
– 1979 గ్రాండ్‌ మసీదు ఘటన సౌదీ చరిత్రలోనే అతిపెద్దది. అల్ట్రాకన్సర్వేటివ్‌ సౌదీ సున్నీ మిలిటెంట్‌ల బృందం గ్రాండ్‌ మసీదును స్వాధీనం చేసుకుంది. అల్‌ సౌద్‌ రాజకుటుంబాన్ని వదులుకోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రెండువారాలు మిలిటెంట్ల ముట్టడి కొనసాగింది. ఈ ఘటనలో అధికారికంగా 229 మంది మరణించారు.
– క్రౌన్‌ప్రిన్స్‌ మహ్మద్‌ హయాంలో ఆయన తండ్రి పాలన నాటి క్రూరత్వాన్ని చాలా వరకు సరళీకరించారు. సినిమా థియేటర్లు తెరవడం, మహిళలను డ్రైవింగ్‌కు అనుమతించడం వంటి సడలింపులు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారీ సంఖ్యలో సామూహిక మరణశిక్షలు అమలుచేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
– ఈ మరణశిక్షలపై ఇటీవల క్రౌన్‌ప్రిన్స్‌ వివరణ కూడాఇచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి మరొకరిని చంపినట్లయితే, బాధిత కుటుంబం ఆ వ్యక్తిని కోర్టులోనూ క్షమించకుంటే, అతనికి మరణశిక్ష తప్పదని చెప్పారు. ఖురాన్‌ చెప్పిందే తాను అమలు చేశానని, నాకు నచ్చినా నచ్చకపోయినా దానిని మార్చే శక్తి నాకు లేదు అని స్పష్టంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement