Friday, May 17, 2024

Exports | ఉల్లిపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం…

ఎన్నికల్లో ఉల్లి చేసే మేలు లేదా కీడు ఎంతో నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. గతంలో జనతా ప్రభుత్వం పరాజయం పాలవడానికి ప్రధాన కారణం కూడా ఉల్లి ధరల పెరుగదలే. మహారాష్ట్రంలో ఉల్లి పండించే రైతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఇప్పుడ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించింది. కనీస ఎగుమతి ధరను మెట్రిక్‌ టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది.

శనివారం ఈ మేరకు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించామని, అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 అమెరికన్‌ డాలర్లుగా నిర్ణయించినట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. 2023 డిసెంబర్‌ 8న ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం ఆ తరువాత ఈ ఏడాది మార్చిలో 31నుంచి నిరవధికంగా పొడిగించింది.

అయితే, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లి రైతులున్న ప్రాంతాల్లో ఓటుబ్యాంకును ఆకర్షించేందుకు ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. కేంద్రవ్యవసాయ శాఖ గత మార్చిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24లో 254.73 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసింది. 2022-23లో 302.08 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదికన్నా ఉత్పత్తి తగ్గడానికి ఉల్లి సాగు చేసే నాలుగు రాష్ట్రాలలో రైతులు విముఖత చూపడమే కారణం.

ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో ఉల్లి సాగుపై రైతులు ఆసక్తి చూపలేదు. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్నాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌లో 3.12 లక్షల టన్నులు మేర ఉత్పత్తి తగ్గింది. కాగా ఉల్లి ఎగుమతులపై మహారాష్ట్రలోని ఉల్లి రైతులు ఆందోళనలు చేపట్టారు. అవి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈలోగా లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గత నెల ఇరుగుపొరుగున ఉన్న ముస్లిం, గల్ఫ్‌ దేశాలకు ఉల్లి ఎగుమతులకు పాక్షికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్‌, యూఏఈ, భూటాన్‌, బహ్రెయిన్‌, మారిషస్‌, శ్రీలంక దేశాలకు 99,150 టన్నుల ఉల్లిని రైతులు ఎగుమతి చేశారు.

- Advertisement -

ఉల్లి ఎగుమతులపై నిర్లక్ష్య వైఖరితో నిషేధం విధించిందని కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే ఆ నిషేధాన్ని తొలగిస్తామని, రైతులు సాగు చేసి, పంట చేతికొచ్చే సమయంలో నిషేధం వంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని, ఆ విధానాన్ని తాము అనుసరించబోమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉల్లి రైతులను బుజ్జగించేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement