Saturday, April 27, 2024

గ్రీన్​ టార్గెట్​కు తగ్గట్టే కార్ల తయారీ.. వచ్చే పదేళ్లలో పెట్రోలు వాహనాలు ఉండవన్న మారుతీసుజుకీ

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడు నుంచి పదేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాలను దశలవారీగా తొలగించనున్నట్టు ఆటోమేకర్ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ భారత ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్ టార్గెట్‌కు తగ్గట్టు తన ఉత్పత్తులను అప్‌డేట్ చేయాలని చూస్తున్నందున ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. తన మొత్తం వాహన తయారీ సిస్టమ్​ని పర్యావరణ అనుకూల పరిస్థితులకు తగ్గట్టు మార్చడానికి మరో 7నుంచి-10 సంవత్సరాలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

రాబోయే పదేళ్ల కాలంలో తాము అన్ని వాహనాలను మారుస్తామని, పెట్రోల్​తో నడిచే వాహనాలు ఇకపై ఉండబోవని మారుతీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రామన్ తెలిపారు. మారుతీ వాహనాలన్నీ ఇకమీదట ఎలక్ట్రానిక్​, లేదా CNG తో నడిచేవి గానూ, లేకుంటే బయో ఇంధనం ద్వారా నడిచేలా తయారు చేస్తామన్నారు. అయితే.. ఎలక్ట్రిక్, బయో ఇంధనం ఆధారిత వాహనాల ధరలలో గణనీయమైన మార్పు ఉంటుందని రామన్ చెప్పారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ చేయడం అనేది ప్రస్తుతం సవాలుగా మారుతోందన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.

ఎలక్ట్రానిక్​ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇల్లు లేదా కార్యాలయంలో బేస్ చార్జింగ్ చేయాలి. కానీ, దానికి తగ్గ మౌలిక సదుపాయాలు మన దగ్గర లేవు. అందువల్ల ఇల్లు, ఆఫీసు.. ఇతర ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ఈవీల వాడకం మరింత పెరుగుతుంది అని ఆయన అన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని వాహనాలు కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక ప్రమాణాలకు (CAFE) అనుగుణంగా ఉండాలని రామన్​ చెప్పారు. కాగా, ఏప్రిల్ 2020లో డీజిల్ వాహనాల ఉత్పత్తిని మారుతీ కంపెనీ నిలిపివేసింది.. కానీ, 2025కి ముందు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయబోమని కూడా ఆ కంపెనీ స్పష్టం చేస్తోంది. ఎందుకంటే చార్జింగ్​ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇప్పుడున్న వాహనదారులు చార్జింగ్​ కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కంపెనీ ప్రతినిధులు అన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement