Wednesday, May 22, 2024

Big Story | ఆలయాలకు మహర్దశ.. సీఎం కేసీఆర్​ అండతో ధూప, దీప నైవేద్యం సమర్పయామి!

ఉమ్మడి మెదక్​ జిల్లాలో దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆలయాలకు మహర్దశ రానుంది. ఇన్నాళ్లు కనీసం ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న అర్చకులకు సీఎం కేసీఆర్ ఆర్థికంగా అండగా నిలవాలని భావించారు. ఉమ్మడి జిల్లాలో ఆలనాపాలనా లేక చాలా ఆలయాలు పూర్తిగా జీర్ణావస్థకు చేరాయి. వాటిని కూడా గుర్తించి ధూప, దీప నైవేద్యం పథకం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం​ నిర్ణయించింది. ఉమ్మడి మెదక్​ జిల్లాలో ధూప, దీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం కింద కొత్తగా ఎంపికలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. ఇప్పటికే  మెదక్​ జిల్లాలో 710, సంగారెడ్డి జిల్లాలో 1236, సిద్దిపేట జిల్లాలో 955 ఆలయాలను దేవాదాయ శాఖ గుర్తించింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ 2901 ఉండగా వీటిలో ప్రస్తుతం 895 ఆలయాలను ధూప, దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందస్తోంది.

– ప్రభ న్యూస్​ బ్యూరో, ఉమ్మడి మెదక్

ఉమ్మడి మెదక్​, ప్రభ న్యూస్​ బ్యూరో: పురాతన కాలం నుంచి, ఆ తర్వాత వెలిసిన ఆలయాల్లో నిత్యం ఆ దేవుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించేందుకు గాను అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించి సమైక్యా రాష్ట్రంలో (2007లో) కాంగ్రెస్‌ ప్రభుత్వ ధూప, దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి సీఎం వైఎస్సార్​ ఈ నిర్ణయం తీసుకుకున్నారు. అప్పుడు ధూప, దీప నైవేద్యం కోసం 1000 రూపాయలు, అర్చకులకు వేతనంగా రూ.1500 ఈ మొత్తం కలిపి రూ.2500 ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ధూప దీప నైవేద్య పథకానికి ఆ మొత్తం సరిపోవడం లేదని భావించిన సీఎం కేసీఆర్​ అప్పటి నుంచి రూ. 6 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. ఈ మొత్తంలో ధూప, దీప నైవేద్యానికి రూ. 2 వేలు, అర్చకులకు వేతనంగా రూ. 4వేలు ఇస్తున్నారు.

అర్చకులకు అండగా సీఎం కేసీఆర్​..

ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా డీడీఎన్‌ కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకాన్ని మరికొన్ని దేవాలయాలకు కూడా వర్తింపజేస్తామని సీఎం చేసిన ప్రకటన మేరకు ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరికొన్ని దేవాలయాలను గుర్తించారు. భృతిని పొందే అర్హత వయసు 75 ఏళ్ల వయసు పరిమితిని 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు సీఎం కేసీఆర్​ తెలిపారు. డీడీఎన్‌ పథకం కింద దేవాలయాల ఎంపికకు చాలా దరఖాస్తులు వచ్చాయి. అయితే రిజిస్ట్రేషన్‌ లేని ఆలయాలు, భూములు కలిగిన గుళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయలేదు.

- Advertisement -

పారదర్శకంగా ఎంపిక..

దేవాలయాల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తు కోసం ఒక ఫార్మాట్‌ను రూపొందించింది. అందులో దేవాలయం పేరు, చిరునామా, సెక్షన్‌ 6, 43, దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 కింద వివరాలు పొందుపరచాలి. ఆలయానికి ఉన్న ఆస్తులు, ఆదాయం, అర్చకుడి వివరాలు అర్చకుడు ఏ ఆగమం ప్రకారం చేస్తున్నది.. ఆలయ చరిత్ర, మండల కేంద్రం నుంచి గుడి వరకు దూరం.. తదితర సమాచారాన్ని అందులో ఆడిగారు. ఈ ఫారాన్ని పూర్తి చేసి సమర్పించిన తర్వాత క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఆలయాలను ఎంపిక చేశారు.

ఉమ్మడి జిల్లా అర్చకులకు అండగా మంత్రి హరీశ్​రావు..

ఉమ్మడి జిల్లాలోని అర్చకులకు అండగా మంత్రి హరీశ్​రావు అన్ని రకాల అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్​ తో మాట్లాడి అర్చకులకు వేతనాల దగ్గర నుంచి ధూప దీప నైవేద్యం పథకం అమలుకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అర్హత ఉండి, సెలక్షన్​ కమిటీ నిర్ణయం మేరకు డీడీఎన్​ పథకం నిధులు అందేలా చొరవ చూపుతున్నారు. ఇతర ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశించారు. జీర్ణోద్ధరణ దశలో ఉన్న ఆలయాలను పూర్వ వైభవం తెచ్చేలా పున: నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పక్కాగా దరఖాస్తుల పరిశీలన.. పైరవీలకు చాన్స్​లేదు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తంగా 2,901 ఆలయాలలో ధూపదీప నైవేద్యాల కింద 895 దేవాలయాలకు ప్రభుత్వం గుర్తించింది. ధూప దీప నైవేద్యం కింద నోటిఫికేషన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పక్కాగా పరిశీలించి సెలక్షన్ కమిటీ నిర్ణయాల మేరకు 895 ఆలయను అర్హతగా ప్రకటించాం.  ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు. ప్రస్తుతం అర్చకులకు, ఆలయాల ధూప, దీప నైవేద్యాలకు కలిపి ప్రభుత్వం 10వేల రూపాయలను అందజేస్తోంది.  ఇందులో ఆలయాల ధూప దీప నైవేద్యానికి 4వేలు, అర్చకులకు వేతనంగా రూ.6వేలను అందిస్తున్నాం.ఈ మేరకు ఈ మధ్యనే సీఎం కేసీఆర్​ ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

– శివరాజ్, సహాయక కమిషనర్, దేవాదాయ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా

Advertisement

తాజా వార్తలు

Advertisement