Sunday, May 5, 2024

సాగర్ ఉపఎన్నిక: కేసీఆర్ కు జానారెడ్డి సవాల్!

తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ సాగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. సాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ లుగా గెలవలేని వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణీ అవుతున్నారని విమర్శించారు. సాగర్ కు తానేం చేశానో అడిగే హక్కు ఇతర పార్టీలకు లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తాము నీళ్లు ఇవ్వలేదని అంటున్నారని, కేసీఆర్ వస్తే తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామని జానా సవాల్ విసిరారు. ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ వెలిగే ఇతర పార్టీ నేతల్లా కాకుండా, జానారెడ్డి అంటే ఓ పోరాట యోధుడని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తగునా? అని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండల వ్యవస్థకు ఆద్యుడ్ని తానేనని జానారెడ్డి పేర్కొన్నారు. మండలం ప్రాతిపదికగా ప్రజలకు ఉపాధి లభిస్తోందంటే అది తన ఆలోచన వల్లేనని వివరించారు. ఈ విషయం ఇప్పటివాళ్లకు తెలియదని, కేసీఆర్ కు కొద్దికొద్దిగా తెలిసినా బయటికి చెప్పడని అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో అజ్ఞాతంలో ఉన్నవారిని బయటికి రప్పించి శాంతి చర్చలకు బాటలు వేసిన యోధుడు ఎవరు… తానేనని ఉద్ఘాటించారు. కానీ సీఎం కేసీఆర్… జానారెడ్డి ఎవరు అంటాడా? నన్ను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. తన గురించి కేసీఆర్కు తెలుసని కానీ చెప్పడని పేర్కొన్నారు. ‘నామినేషన్లు వేసి అందరం ఇంట్లోనే ఉందాం. కేసీఆర్ ప్రగతిభవన్లో.. బీజేపీ నేతలు వాళ్ల భవన్లో కూర్చొండి. నేను గాంధీభవన్లో కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దాం’ అంటూ జానా సవాల్ విసిరారు. డబ్బులకు అమ్ముడుపోయి బానిసలుగా మారొద్దని సూచించారు. డబ్బు వెదజల్లి ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. సాగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు బహుమతిగా ఇద్దామని జానారెడ్డి పిలుపునిచ్చారు.

కాగా ఈ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement