Saturday, April 27, 2024

కలం పక్కనెట్టి.. హలం చేతబట్టి..

రెక్కలు ముక్కలయ్యేలా తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయింది ఆ విద్యార్థిని. చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడతుంటే తానూ సాయం కావాలనుకుంది. చిన్నప్పటి నుంచి పొలం పనుల్లో తండ్రికి అండగా నిలిచి భేష్ అనిపించుకుంది. ఇంటిల్లిపాది కరోనాతో మంచాన పడితే వారందరికీ ఓ పక్క సపర్యలు చేస్తూనే మరోవైపు తాను స్వయంగా దుక్కి దున్ని వ్యవసాయ పనులను ముమ్మరం చేసింది. చదువు, సంధ్యల్లోనూ, ఆట పాటల్లోనూ ప్రతిభ కనబర్చే ఈ విద్యార్థిని కుటుంబ భారాన్ని మోసే విషయంలో పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆ విద్యార్థినే దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన కారం రమ్య.

రమ్య 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక ఆశ్రమ పాఠశాలలలో విద్యానభ్యసించింది. 6 నుంచి 10వ తరగతి వరకు దుమ్ముగూడెం కస్తూర్భా గాంధీ వసతి గృహంలో విద్యాబుద్ధులు నేర్చుకుంది. ఇంటర్ మీడియట్ ను కూడా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ దోమలగూడ ఏవీ కాలేజ్ లో పీఈటీ కోర్సును చేపడుతోంది. సెలవుల్లో ఇంటికి వచ్చిన క్షణం నుంచే తల్లిదండ్రుల కష్టాన్ని తన భూజస్కందాలపై మోయడం చిన్ననాటి నుంచే అలవర్చుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా గత కొంత కాలంగా ఇంట్లోనూ గడుపుతున్న విద్యార్థికి మరో అదనపు కష్టం వచ్చి పడింది. తన తండ్రి కారం లక్ష్మయ్య, తల్లి నాగమ్మతో పాటు సోదరిలు కూడా అందరూ ఒక్కసారిగా కరోనా బారిన పడటంతో వారికి అన్నీ తానై సపర్యలు చేసింది. ఉన్న కొద్దిపాటి పొలం పనులు నలిచిపోతుంటే తాను స్వయంగా దుక్కిదున్ని నారు పోసి వరి, పత్తి వ్యవసాయాలను ఒంటి చేత్తో చేస్తోంది. కుటుంబ పోషణ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చదువుకు తాత్కాలికంగా సెలవు ప్రకటించుకుని, పొలం పనుల్లో నిమగ్నమైందీ ఆ విద్యార్థిని.

కబడ్డీ క్రీడల్లో రాష్ట్రస్థాయికి…

కారం రమ్య ఆది నుంచి క్రీడలపై శ్రద్ద కనబర్చేది. కబడ్డీ క్రీడ మీదమక్కువతో మండల, జిల్లా స్థాయి నుంచి కబడ్డీక్రీడల్లో పాల్గొంది. కస్తూర్భా గాంధీ వసతి గృహంలో అక్కడి అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతో సిద్ధిపేట, నల్గొండల్లో రాష్ట్రస్థాయిలో అవార్డులు సాధించుకుంది. జాతీయస్థాయికి వెళ్ళే  అవకాశం వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ తీసుకోవడం వలన ప్రాక్టికల్ పరీక్షల మార్కులు తగ్గుతాయన్న ఆలోచనతో జాతీయ స్థాయి కబడ్డీకి సెలవు ప్రకటించుకుంది.

లక్ష్య సాధన కోసమేతపన…..

- Advertisement -

అడిగినవస్తువులను ఇవ్వకపోతే తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న విద్యార్థులను మనం చూస్తున్నాం. కానీ రమ్య కుటుంబంలో చిన్న కూతురే అయినప్పటికీ అన్ని భారాలు తన భుజస్కందాలపై వేసుకుని ఆదర్శంగా నిలుస్తోంది. గిరిజన విద్యార్థుల పటుత్వం, జాతీయ స్థాయిలో గుర్తించాలనే తలంపుతో పిఇటి కావాలనే లక్ష్య సాధనతో గడుపుతోంది. ఎందరో విద్యార్థులు ప్రతిభ కలిగినప్పటికీ జాతీయ స్థాయిలోక్రీడలకు చేరుకోలేక పోతున్నారని, దీనిని గుర్తించిన తాను క్రీడాకారులను విద్యార్థి దశ నుంచే మేల్కొలిపేలా పిఇటి అవుతానని ఆంధ్రప్రభకు రమ్య తెలిపింది. కుటుంబ పరిస్థితి కష్టంగా గడుస్తున్న ప్రతిసారీ తనలో పట్టుదల మరింతగా పెరుగుతుందని, పిఇటిగా రాణించి గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలన్న తలంపుతో ఉన్న ఆ విద్యార్థినికి సరైన ప్రోత్సాహం అందించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఎందరికో స్ఫూర్తిదాయంగా నిలుస్తున్న కారం రమ్య మరెందరికో ఆదర్శం కావాలని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement