Thursday, May 16, 2024

Fourth Lion – కెసిఆర్ డైరెక్ష‌న్ .. సిపి రంగ‌నాథ్ యాక్ష‌న్ …

నాడు భూ ఆక్రమణలు.. భూ దందాలు.. ఇంటిలిజెన్స్‌ నివేదికలు.. స్థానికుల ఫిర్యాదులు.. పోలీస్‌ శాఖలో నెలకొన్న అవినీతి.. అసమర్థ పోలీస్‌ అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడితో బాధితులు పడుతున్న అవస్థ లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి కి వస్తుండేవి.. చారిత్రక.. వారసత్వ సంపదకు నిలయమై.. సాంస్కృతిక నేపథ్యం కలిగిన వరంగల్‌ జిల్లాలో సాగుతున్న ఘటనలతో విసుగుచెందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏరి కోరి.. సమర్థవంతమైన అధికారిని నియమించాలన్న ఆలోచనతో.. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కమిషనర్‌(సీపీ)గా ఆవుల వెంకట రంగనాథ్‌ను నియమించారు… ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏవీ.రంగనాథ్‌ తీసుకున్న దిద్దుబాటు చర్యల ఫలితంగా వందల కేసులు.. భూ ఆక్రమణలు.. భూ తగాదాలను సమూలంగా నియంత్రించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి…

వరంగల్‌, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు, తగాదాల కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నాడు వందలు, వేలల్లో వచ్చే ఫిర్యాదులు నేడు పదుల సంఖ్యకు తగ్గుముఖం పట్టగా, భూ ఆక్రమణలు, దందాల అరాచకాన్ని సమూలంగా నియంత్రించడం పట్ల కమిషనరేట్‌ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ తగాదాలు, ఆక్రమణలపై ఫోకస్‌ పెట్టి, కఠినచర్యలు తీసుకోవాలంటూ సీపీ రంగనాథ్‌కు చేసిన దిశానిర్దేశం సత్ఫలితాలనిస్తోంది. 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రంగనాథ్‌, ముక్కుసూటి అధికారిగా ఎక్కడ విధులు నిర్వహించినా తన మార్క్‌ చాటుతూనే ఉన్నారు. 2022 నవంబర్‌ 30న జరిగిన బదలీల్లో భాగంగా వరంగల్‌ సీపీగా ఆయన నియమితులయ్యారు. వరంగల్‌ సీపీగా బాధ్యతలు చేపట్టింది మొదలు ముందుగా శాఖాపరమైన అంశాలపై ఆయన దృష్టి సారించారు. దాదాపు పది రోజులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న భూ ఆక్రమణలు, తగాదాలు, కేసులకు సంబంధించి జరిగిన శాఖాపరమైన నిర్లక్ష్యాన్ని గుర్తించిన రంగనాథ్‌, పోలీస్‌ శాఖలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. భూ తగాదాల్లో తలదూర్చుతున్న పోలీస్‌ అధికారులపై బదలీ, సస్పెన్షన్‌ వేటు వేస్తూ, వారిని దారిలోకి తీసుకువచ్చారు. అనంతరం భూ ఆక్రమణలు, భూ దందాలు, గొడవలకు కారకులైన చోటా మోటా నాయకులు మొదలు, అధికార, విపక్షాలకు నాయకులను గుర్తించి, వారిని హెచ్చరించడంతో పాటు పలువురిపై కేసులు పెట్టి, జైళ్లకు సైతం తరలించారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ను, ప్రతిపక్ష కార్పొరేటర్‌ను జైలుకు పంపారు. భూ ఆక్రమణల మకిలి అధికార పార్టీ నాయకులకు అంటుకొని, బాధితులు, స్థానికులు, విపక్ష పార్టీల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తేవి. అయితే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏవీ.రంగనాథ్‌, మొహమాటం లేకుండా అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. దీంతో ప్రభుత్వం పట్ల, పోలీస్‌ శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం పదింతలు పెరిగింది.

నాటికీ.. నేటికీ ఎంతో వ్యత్యాసం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విధంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పోలీస్‌ శాఖలో సీపీ రంగనాథ్‌ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా నాడు వందలు, వేలల్లో వచ్చే ఫిర్యాదులు, పదుల సంఖ్యకు పరిమితమయ్యాయి. దీంతో తాజా ఇంటిలిజెన్స్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయించిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, పోలీస్‌ శాఖ పట్ల ప్రజలు సదాభిప్రాయంతో ఉన్నారన్న విషయాన్ని నివేదిక రూపంలో అందజేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజల మనస్సుల్లో ఏముందో తెలుసుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా సాగిన సర్వేల్లో గతానికి భిన్నంగా భూ తగాదాలు, ఆక్రమణల ఫిర్యాదులు తగ్గడం పట్ల ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారని తేలినట్లు సమాచారం. మొత్తంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థవంతమైన అధికారి ఏవీ.రంగనాథ్‌ను పంపించడం ద్వారా సమూల మార్పులకు కారణమయ్యారన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఏవీ.రంగనాథ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలో ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేపడుతున్న తీరు, బాధితుల హృదయాలను గెలుచుకుని పోలీస్‌ శాఖకు మంచిపేరును తెచ్చిపెట్టాయనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement