Tuesday, July 23, 2024

Siddipet – కరెంట్​ కోతలు ప్రభుత్వ వైఫల్యమే – మాజీ మంత్రి హరీశ్ రావు

అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ఆయన పాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై, తనపై ముఖ్యమంత్రి రెడ్డి చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు. విద్యుత్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు వేయడం విడ్డూరమన్నారు. విద్యుత్ రంగ వైఫల్యాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఆడరాక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

- Advertisement -

ఇరవై నాలుగు గంటలూ నిరంతర విద్యుత్ అందించేందుకు… బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు సరిపోయేలా విద్యుత్ సరఫరా చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి నెపాన్ని ఉద్యోగుల పైకి నెట్టాలనే ఆలోచన తప్ప… విద్యుత్ కోతల లేకుండా సరిదిద్దాలనే ఆలోచన లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులను నిందించే చిల్లర చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, విద్యుత్ కోతలకు కొందరు విద్యుత్ ఉద్యోగులే కారణమని, హరీశ్ రావు వారితో పవర్ కట్స్ చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement