Saturday, May 4, 2024

కరోనా ఆ బాలికకు శాపం!

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్కూళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కరోనా బారిన పడింది. అయితే, కరోనా సోకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. బాలిక కారణంగా ఊరిలో మిగతావారికి కరోనా వ్యాపిస్తుందేమోనన్న భయంతో ఆమెను ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆమె గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గుడిసెకే పరిమితమైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది.

ఇంద్రవెల్లి మండలం సాలేగూడకు చెందిన మడావి సోన్‌దేవి నిర్మల్ జిల్లాలోని ట్రైబల్ వెల్పేర్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. అయితే అక్కడ చదువుతున్న పలువురు విద్యార్థులతోపాటు సోన్ దేవికి కూడా కరోనా వచ్చింది. దీంతో బాలిక గ్రామానికి వచ్చింది. అయితే గ్రామ పెద్దలు ఆమెను ఊరిలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని వారి పొలంలో ప్రత్యేకంగా గుడిసె ఏర్పాటు చేసి.. బాలికను అందులో ఉంచారు.

పొలంలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చిమ్మ చీకటిలో గడుపుతోంది. గురుకుల అధికారులు గ్రామపెద్దలను కలిసి మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. క్వారంటైన్ ముగిసిన తర్వాతనే సోన్ దేవిని గ్రామంలోకి ఆహ్వానిస్తామని గ్రామపెద్దలు చెప్పారు. పొలంలో ఆమెకు ఎలాంటి భయంలేదని, అన్ని ఏర్పాట్లు చేశామని గ్రామపెద్దలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు అయితే ఆమె క్వారంటైన్ పూర్తవుతుందని.. అప్పుడు మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. దీంతో బాలిక మరికొంత కాలం గుడిసెలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement