Thursday, May 16, 2024

T20 World Cup : పేరుకే అమెరికా…. అందరూ మనోళ్లే….

టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. గుజరాత్‌ అండర్‌-19 జట్టుకు ఆడిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మోనాంక్‌ పటేల్‌ ఇప్పుడీ అమెరికా జట్టుకు కెప్టెన్‌. 2018-19 రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మిలింద్‌ కుమార్‌ అమెరికా జట్టులో దక్కించుకున్నాడు.

ఆ సీజన్‌లో సిక్కిం తరఫున 1331 పరుగులు చేసిన మిలింద్‌.. దేశవాళీల్లో దిల్లీ, త్రిపుర, సిక్కిం తరపున ఆడాడు. ఐపీఎల్‌లో అప్పటి దిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. మెరుగైన అవకాశాల కోసం అతను అమెరికా వెళ్లాడు. ముంబయి మాజీ బౌలర్లు హర్మీత్‌ సింగ్‌, సౌరభ్‌ కూడా ఈ ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు.

- Advertisement -

2012 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు హార్మీత్‌ ఆడాడు. 2010 అండర్‌-19 ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, మయాంక్‌ లాంటి ఆటగాళ్లున్న భారత జట్టులో సౌరభ్‌ ఉన్నాడు. అయితే 2012 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ మాత్రం అమెరికా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్‌ అమెరికా తరపున ప్రపంచకప్‌ ఆడబోతున్నాడు. పాకిస్థాన్‌ సంతతి పేసర్‌ అలీ ఖాన్‌ కూడా స్థానం సొంతం చేసుకున్నాడు. జూన్‌ 2న ఆరంభమయ్యే ఈ పొట్టికప్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌, కెనడా, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌తో కలిసి అమెరికా గ్రూప్‌- ఎ లో ఉంది.

అమెరికా జట్టు: మోనాంక్‌ పటేల్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జోన్స్‌, ఆండ్రీస్‌ గౌస్‌, కోరె అండర్సన్‌, అలీ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌, జెస్సీ సింగ్‌, మిలింద్‌ కుమార్‌, నిసర్గ్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌, కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్‌, షాడ్లీ, స్టీవెన్‌ టేలర్‌, షయాన్‌ జహంగీర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement