Monday, April 29, 2024

కేంద్రం తీరుతో ఉపాధి గాయ‌బ్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో కూలీలు స్వచ్చందంగా తిరస్కరిస్తున్నారు. ఒక ప్పుడు కూలీ దొరకక ఇబ్బందులు పడిన గ్రామీణ కార్మికులు, నేడు ఉపాధి కల్పిస్తాం… రమ్మని బతిమిలాడినా రాలేమని తెగేసి చెబుతున్నారు. అందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నా యంగా అనుబంధ ఉపాధి అవకాశాలు మెరుగు పడడం, అదే సమయంలో ‘ఉపాధి హామీ’ పథకంలో అతితక్కువ కూలీ ఇవ్వడం. కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యత తగ్గించిందే తడువుగా ఈ ప్రతిష్టాత్మక పథకం
క్రమక్రమంగా నిర్వీర్యమవుతూ వస్తోంది. బయట పనులకు వెళితే, నిత్య కూలీ రేటు రూ.650కి మించి వస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేవలం రూ.150 మాత్రమే ఇస్తున్నారు. ప్రతికూల వాతావరణంలో పనులకు వెళుతున్న కూలీలకు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దీంతో స్వచ్చందంగా నిరాకరించే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఒకవేళ పనులకు వెళ్ళినా.. ఆధార్‌తో లింకు, బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్న కూలీ డబ్బులు, ఎప్పుడిస్తారో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం నానాటికీ నిర్వీర్యమవుతోంది. జాతీయ స్థాయిలో 14 రాష్ట్రాల్లో అప్రకటిత రద్దు దిశగా ‘ఈజీఎస్‌’ పథకం ప్రజాదరణ కోల్పోతోంది. పేరుకుపోతున్న బకాయలు రాబట్టే ప్రయత్నం ఫలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణాకు రూ.967 కోట్లు, ఏపీకి రూ.836 కోట్లు ఉపాధి హామీ పథకం నిధులు కేంద్రం బకాయపడి ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా ఇదే దుస్థితి వెంటాడుతోంది. ఫలితంగా ఉపాధి హామీకి కూలీల లేమి పెరుగుతూ వస్తోంది. కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ కోణంలో చూసినా పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగులకు టార్గెట్‌.. కనీసం 200 మందిని తీసుకొస్తేనే జీతం!
గడిచిన దశాబ్దకాలంగా గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు వేలాది మంది ఉద్యోగులు ఈ పథకం ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. వారందరికీ నేడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో 200 నుంచి 250 మంది కూలీలను పనులకు రప్పిస్తేనే జీతాలిస్తామని అధికారులు టార్గెట్‌ విధించారు. ఆ మేరకు 90శాతం గ్రామాల్లో కూలీల కొరత వారి ఉపాధిని దెబ్బతీస్తోంది. రాత్రిపూట గ్రామాల్లోకి వెళ్లి కూలీలను బతిమిలాడుకుంటు-న్న సిబ్బంది ధీనస్థితికి కేంద్రం పరోక్షంగా కారణమవుతోందని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను తీసుకొచ్చేందుకు ఉపాధి సిబ్బంది అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచే ఉపాధి పనులకు డిమాండ్‌ ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం పనులకు రాకుండా కూలీలు మొహం చాటేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో పనులకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ అసలే లేకుండా పోయింది.

స్తంభిస్తున్న ప్రభుత్వరంగ పనులు
ఉపాధి పనులపైనే నమ్మకం పెట్టు-కున్న ప్రభుత్వం గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. కానీ పనులు జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వం లక్ష్యం నెరవేరేలా కనిపించట్లేదు. దీంతో గత్యంతరం లేక కలెక్టర్లను ఉపాధి పనులపైనే ఫోకస్‌ పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని మండలాలకు జిల్లా ఆఫీసర్లను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు- లేబర్‌ టార్గెట్‌ పెట్టింది. ప్రతీరోజు గ్రామంలో కనీసం రెండొందల మంది కూలీలను ఉపాధి పనులకు తరలించాలని ఆదేశించింది. కూలీలను పనులకు రప్పించకుంటే రాబోయే రోజుల్లో ఉపాధి హామీ ఎంప్లాయిస్‌కు, గ్రామీణాభివృద్ధి ఆఫీసర్లకు జీతాలు ఇవ్వలేమని, పరిపాలన ఖర్చులు కూడా భరించడం కష్టమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

- Advertisement -

కూలీల ఆకర్షణకు అవగాహన సదస్సులు
ఈ పరిస్థితులను అధిగమించేందుకు జిల్లా కలెక్టర్లు, ఈజీఎస్‌ ఆఫీసర్లు కూలీలను తరలిచేందుకు మండలాల్లో అవగాహన సదస్సులు పెడుతున్నారు. మరోవైపు ఉపాధి సిబ్బంది రాత్రిపూట గ్రామాల్లోకి వెళ్లి కూలీలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఉపాధి పనులకు రావాలని, లేదంటే.. మీతో పాటు మేమూ నష్టపోతామని ఉద్యోగులు వాపోతున్నారు. ఉపాధి చట్టం ప్రకారం జరిగే పనుల్లో 60శాతం కూలీలకు, 40శాతం మెటీ-రియల్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేబర్‌ బడ్జెట్‌ అనుకున్న ప్రకారం పనులు జరిగితే 40శాతం మెటీ-రియల్‌ నుంచి ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ పనులు, ఎంప్లాయీస్‌ శాలరీలు, స్టేషనరీ ఖర్చులు చెల్లిస్తుంది. కానీ ఈ సీజన్‌లో 40శాతం మెటీరియల్‌ టార్గెట్‌ సాధించడం కష్టమని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక భత్యం కట్‌..
ఇన్నాళ్లు ఉపాధి పథకంపైనే గ్రామాల్లో శ్మశాన వాటికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, హరితహారం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది నుంచి కేంద్రం డైరెక్ట్‌గా ఉపాధి పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వడం ఆపేసింది. ఉపాధి పథకం కేంద్రం ఆధీనంలోకి వెళ్లిందన్న అక్కసుతో కూలీలకు వేసవి సీజన్‌లో ఇవ్వాల్సిన స్పెషల్‌ అలవెన్స్‌ ఇవ్వడం ఆపేసింది. పైగా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కల్పించాల్సిన ప్రత్యేక వసతులు, సామాను రిపేర్లకు డబ్బులు ఇవ్వట్లేదు. గతేడాది నర్సరీలకు సరఫరా చేసిన మట్టితోలకం డబ్బులే ఇప్పటి వరకు సర్పంచులకు ఇవ్వలేదు.

గ్రామ సర్పంచ్‌ల నిరాసక్తత
గతేడాది గ్రామాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన మెటీ-రియల్‌ డబ్బులు కూడా చెల్లించలేదు. దీంతో ఉపాధి పథకం కింద ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఇటు- కూలీలు, అటు- సర్పంచులు ఆసక్తి చూపించడం లేదు. ఉపాధి పథకంలో వచ్చిన సాప్ట్‌nవేర్‌ మార్పులు కూడా కూలీలకు కొత్త సమస్యలు తీసుకొచ్చాయి. పనుల్లో జరిగే అక్రమాలు, అవినీతి చెక్‌ పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఐసీ సాప్ట్ వేర్‌ సవాల్‌గా మారింది. ఈ సాప్ట్‌nవేర్‌ వచ్చాక ఉదయం, సాయంత్రం కూలీల హాజరు తీసుకోవాల్సిరావడం, పనులు జరుగుతున్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)లో అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది.

40శాతం రాష్ట్రాలే భరించాలి: కేంద్రం
అసలే ఆదరణ కోల్పోతున్న ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించలేని స్థితితో రాష్ట్రాలు చేతులెత్తేస్తుంటే.. కేంద్రం మాత్రం కొత్త మెలికలు పెడుతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు కూలీలకు ఇచ్చే వేతనాలలో 40శాతం రాష్ట్రాలు భరించాలని పేర్కొన్నారు. ఈజీఎస్‌ను నిరంతర ఉపాధి పథకంగా పరిగణించరాదని కూడా చెప్పారు. ఎక్కడా పని దొరకని వారికి తాత్కాలికంగా పని కల్పించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కూలీలకు ఇచ్చే వేతనాలను ప్రస్తుతం 100 శాతం కేంద్రమే భరిస్తున్నదని, దీనిని కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకొనే విధంగా చట్టాన్ని సవరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement