Tuesday, May 14, 2024

కరోనా తర్వాత కొత్త రోగం.. చాలామందికి ‘బ్లాక్ ఫంగస్’ బెడద

కరోనా నుంచి కోలుకున్న వారికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న, కోలుకున్న కొందరు వ్యక్తులలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్ళు కనిపించినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కరోనాతో బాధపడుతున్న వ్యక్తులలోనే కాకుండా కోలుకున్న వ్యక్తులలోనూ బ్లాక్ ఫంగస్ అనే ఇన్ఫెక్షన్‌ను గుర్తించినట్లు వారు చెప్తున్నారు. దీనినే ముకోర్మైకోసిస్ అని కూడా అంటారని తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు. గత 15 రోజుల్లో సూరత్​లో 40 మందికి ఈ వ్యాధి సోకగా 8 మందికి కంటి చూపు కోల్పోయారు.​ మహారాష్ట్రలో ప్రస్తుతం 200 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది క్రమంగా దృష్టి లోపానికి దారితీస్తుందని చెప్తున్నారు.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు
కరోనా నుంచి కోలుకున్న వారికి 2, 3 రోజుల తర్వాత బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో చేరి తర్వాత కళ్లపై దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో మెదడు​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయిన చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన డయాబెటిస్​తో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా కోలుకునేందుకు స్టెరాయిడ్స్​ ఇస్తున్నారని.. ఇది బ్లాక్​ ఫంగస్​ ఇన్ఫెక్షన్​కు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్​ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మందుల కొరత ఉన్నందున చికిత్స కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్​ కోసం రోజు సుమారు రూ. 9 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా బెడ్ ఛార్జీలు, ఇతర మందులు వంటివి భరించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: కరోనా రోగి దేశంలో ఎక్కడైనా ఆస్పత్రిలో చేరొచ్చు: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement