Saturday, April 27, 2024

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేశాకే బీజేపీకి విశ్రాంతి: జేపీ న‌డ్డా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన తర్వాతే బీజేపీ విశ్రమిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్టుపై ఆయన ఘాటుగా స్పందించారు. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్ కార్యాలయంలోకి తెలంగాణ పోలీసులు ప్రవేశించి బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి, లాఠీఛార్జి చేయడం తీవ్ర ఆక్షేపణీయం, ఖండనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులే బీజేపీ నేతలు, కార్యకర్తలపై హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 317 గురించి బండి సంజయ్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన కార్యాలయానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేరుకున్నారని నడ్డా వివరించారు. సీఎం కేసీఆర్‌ తీరుకు వ్యతిరేకంగా టీచర్లు, సిబ్బంది చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ బండి సంజయ్ కోవిడ్-19 ప్రొటోకాల్స్ పాటిస్తూ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుతంగా చేస్తున్న బండి సంజయ్ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని, వారందరిపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించిందని ఆరోపించారు. తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపు, అరాచకత్వానికి నిదర్శనంగా భారీ పోలీసు బలగాలతో పక్కా వ్యూహంతో దాడికి పాల్పడ్డారని నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు ముందుగా ఇనుప గేట్లను కట్ చేసి బలవంతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారని నడ్డా చెప్పారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆయన వెంట ఉన్న నేతలు, కార్యకర్తలపై అమానుషంగా దాడికి పాల్పడి అరెస్ట్ చేశారని వెల్లడించారు.

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం కలవరపడుతూ ఆందోళన చెందుతోందని ఆయన వివరించారు. నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అమానవీయ, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని నడ్డా దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అవమానకర, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని కేసీఆర్ తెలుసుకోవాలని తేల్చి చెప్పారు. ప్రజావ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగించాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement