Friday, May 10, 2024

మనది వెస్ట్ బెంగాల్ కాదు.. తెలంగాణ– కేసీఆర్ కుటుంబానికి చట్టం వర్తించదా?: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బెంగాల్‌ మాదిరిగా తెలంగాణలో పాలన చేయాలనుకుంటే జనం తిరగబడతారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగస్తులు, టీచర్లను ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేస్తోందని, దానివల్ల వారు స్థానికతను కోల్పోతారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారని, అందులో భాగంగానే బండి సంజయ్ క్యాంప్ ఆఫీసులో జాగరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగస్తులకు అండగా ఉండాల్సిన బాధ్యత బీజేపీపై ఉందనే భావనతో దీక్ష ద్వారా నిరసన తెలపాలనుకున్నట్టు వివరించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులకు మాస్క్ పెట్టుకోని మంత్రులు కనిపించలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవాలనుకుంటే జైళ్లు సరిపోవని మండిపడ్డారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని, నిబంధనల ప్రకారం మీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెట్టాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి చట్టం వర్తించదా? టీఆర్‌ఎస్‌కు ఒక నీతి-మిగతా పార్టీలకు మరో నీతా? అని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఎంపీ ఆఫీసుపై దాడి పోలీస్ వ్యవస్థకు మచ్చవంటిదన్న ఆయన పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, చట్టం కొందరికి చుట్టంగా ఉండకూడదని హితవు పలికారు.

ఢిల్లీలో రైతులు ఎన్ని రోజుల పాటు ఆందోళనలు చేసినా ఎప్పుడు తమ ప్రభుత్వం అడ్డుకోలేదని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇష్టారాజ్యంగా హౌజ్ అరెస్టులు ఎందుకు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా హౌస్ అరెస్ట్‌లు చేస్తే తెలంగాణ వచ్చేదా? పోలీస్ వ్యవస్థ దిగజారిపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. సీఎం మమతలా కేసీఆర్ చేయాలనుకుంటున్నారన్న కిషన్ రెడ్డి మనది వెస్ట్ బెంగాల్ కాదు తెలంగాణా అని గుర్తు చేశారు. రజాకారులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు అణచివేయాలనుకుంటే తిరగబడతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలంగాణలో పోలీసులే ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టం అందరికీ ఒక్కటేనని, ఒకే విధంగా అమలు చేయాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement