Saturday, April 27, 2024

Big Story: లక్ష ఓట్లతో.. లక్ష్యాన్ని ముద్దాడిన ఈటల

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఉప ఎన్నిక‌కు జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ పై 23,855 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. రెండు రౌండ్లు మినహా ప్రతి రౌండ్‌లోను ఆధిక్యం కనబరిచిన ఈటల రాజేందర్‌ మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 1,07,022 ఓట్లను సాధించి లక్ష్యాన్ని ముద్దాడారు. 22 రౌండ్లలో ఈటలకు 1,06,780 ఓట్లు లభించగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మరో 242 ఓట్లు లభించాయి.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కు ఈవీఎం ల ద్వారా 82,712 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 455 ఓట్లతో కలిపి మొత్తంగా 83,167 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ కు 3,012 ఓట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా రెండు ఓట్లు క‌తొపొ మోత్తం 3,014 ఓట్లు లభించాయి.

హుజురాబాద్‌ నియోజకవర్గానికి 2018లో జరిగిన సాధారణ ఎన్నికలో ఈటల రాజేందర్‌ 104840 ఓట్లను సాధించారు, ఉప ఎన్నికలో మరిన్ని ఎక్కువ ఓట్లు సాధించి తన పట్టును పదిలపరుచుకున్నారు. పార్టీ వీడి బీజేపీ నుంచి పోటీ చేసినా ఘన విజయం స్వంతం చేసుకొని ఏడు సార్లు వరుస విజయాలు సాధించారు.

హుజూరాబాద్‌ అసెంబ్లి నియోజవర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. మొత్తం రెండు గదులను కౌంటింగ్‌ ఏర్పాటు చేసి 14 టేబుళ్లపై 22 రౌండ్ల లెక్కింపు నిర్వహించారు. వీణవంక మండలం పరిధిలోని 8వ రౌండ్‌, జమ్మికుంట మండలం పరిధిలోని 11వ రౌండ్‌ మినహా ప్రతి రౌండ్‌లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పై ఆధిక్యత కనబరిచారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. కమలాపూర్‌ మండలం ఈవీఎంల లెక్కింపు చివరిలో జరిగాయి. ఇక్కడ ఎక్కువ లీడ్‌ రావడంతో మెజారిటీ అందరు ఉహించిన దానికంటే పెరిగింది.

- Advertisement -

బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరు గెలిచినా 10వే లోపే మెజారిటీ ఉంటుందని అందరూ ఉహించారు, వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ కూడ ఇదే విధంగా ఉండగా అందరి అంచనాలను తలక్రందులు చేస్తూ ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. హుజురాబాద్‌ అసెంబ్లిd నియోజవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పనిచేయలేదు. ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున 20వేల కుటుంబాలకు అందించేందుకు రెండువేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించింది. యూనిట్ల గ్రౌండిండింగ్‌ కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఈ పథకం ద్వారా తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని టీఆర్‌ఎస్‌ భావించింది కాని ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇవేవి పనిచేయలేదు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్‌ షూటర్‌ తన్నీరు హరీష్‌రావు సింగాపురంలో అడ్డావేసి సాగించిన మంత్రాంగం పనిచేయలేదు. మంత్రులు గంగుల కమలాకర్‌ కొప్పుల ఈశ్వర్‌లు ఇన్‌చార్జీలుగా పనిచేసిన చోట కూడ టీఆర్‌ఎస్‌ కు లీడ్‌ రాలేదు. రౌండ్‌ రౌండ్‌ను పరిశీలిస్తే ఈటల రాజేందర్‌కు అంతటా ఒకే వేవ్‌ కనిపించింది. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసినా ఈటల రాజేందర్‌ పార్టీ ఇమేజ్‌ కు తోడు తన స్వంత ఇమేజ్‌ పనిచేయడంతో విజయం సాధ్యమైంది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుదలపై గ్యాస్‌ బుడ్డీలు పట్టుకొని ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్‌లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధిక్యత కనబరిచారు. మొత్తం 777 పోస్టల్‌ బ్యాలెట్‌ లలో 48 చెల్లలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కు 455. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కు 242, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ కు 2, అన్న వైఎస్‌ఆర్‌ పార్టీ అభ్యర్థి అలీ మన్‌సూర్‌ మహ్మద్‌ కు ఒక ఓటు లభించగా ప్రజావాణి పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లుకు 2, ప్రజాఎక్తా పార్టీ ఆభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ కు 8, స్వతంత్ర అభ్యర్థి ఉప్పు రవీందర్‌ కు 1, ఉరుమల్ల విశ్వం కు 2, కుమ్మరి ప్రవీణ్‌ కు 2, కోట శ్యాంకుమార్‌కు ఒకటి, గుగులోతు తిరుపతికి ఒకటి, చిలుక ఆనంద్‌కు ఒకటి, పల్లె ప్రశాంత్‌కు రెండు, పడిశెట్టి రాజుకు ఒకటి, మ్యాకమల్ల రత్నయ్య, మౌతం సంపత్‌ లకు ఒక్కటి చొప్పున, రమేశ్‌ బాబు శనిగరంకు మూడు, లింగపల్ల శ్రీనివాస్‌ రెడ్డికి ఒకటి, విక్రంరెడ్డి వేములకు రెండు పోస్టల్‌ ఓట్లు లభించాయి. పోస్టల్‌ ఓట్లలలో ఈటల కంటే గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కు 213 ఓట్లు అధికంగా వచ్చాయి.

గెల్లు స్వంత గ్రామంలో బీజేపీ ఆధిక్యం
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శీనివాస్‌ యాదవ్‌ స్వంత గ్రామమైన వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి 191 ఓట్ల ఆధిక్యతను సాధించడం విశేషం. అలాగే మంత్రి హరీష్‌రావు దత్తత తీసుకుంటానని ప్రకటించిన ఇదే మండలం మామిడాలపల్లిలోను ఈటల మెజారిటీ సాధించారు. తనకు లభించిన మెజారిటీలో తన స్వంత మండలమైన కమలాపూర్‌లో ఈటల సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement