Friday, December 6, 2024

శ్రీన‌గ‌ర్ లో ముగియ‌నున్న భార‌త్ జోడో.. 21ఎన్డీయేత‌ర పార్టీల‌కి ఆహ్వానం

ఈ నెల 30న భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ కాశ్మీర్ లోని శ్రీన‌గ‌ర్ కి చేరుకోనుంది. ఈ క్ర‌మంలో అక్క‌డ భారీ బ‌హిరంగా స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. ఈ స‌భ‌లో పాలుపంచుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ అనేక రాజ‌కీయ పార్టీల‌ను ఆహ్వానించింది. ఈ పాదయాత్ర ముగింపు కార్య‌క్ర‌మం ప్రతిపక్ష బల ప్రదర్శనగా విస్తరించే ప్రయత్నంలో భాగంగా క‌నిపిస్తోంది. జనవరి 30న జ‌మ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 21 ఎన్డీయేతర పార్టీలను ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో మ‌ల్లికార్జున ఖ‌ర్గే మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మేం ద్వేషం, హింసతో పోరాడటానికి, సత్యం, కరుణ-అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి-అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం-న్యాయం వంటి రాజ్యాంగ విలువలను రక్షించడానికి కట్టుబడి ఉంటాం. ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టిని క్రమబద్ధంగా మళ్లించే మన దేశంలో సంక్షోభ సమయంలో ఈ యాత్ర ఒక శక్తివంతమైన గొంతుకగా ఆవిర్భవించింది.

మీరు పాల్గొని దాని సందేశాన్ని మరింత బలపరుస్తారని నేను ఆశిస్తున్నాను అని ఖర్గే ప్రతిపక్ష పార్టీ ముఖ్యులకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భారత రాష్ట్రీయ సమితి (గతంలో టీఆర్ఎస్) సహా భావసారూప్య పార్టీలన్నింటినీ శ్రీనగర్ యాత్రకు ఆహ్వానించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు ఒకరు తెలిపారు. శ్రీనగర్ యాత్రకు ఐదు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదు. వాటిలో ఏఐడీఎంకే, వైసీపీ, బీజేడీ, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్. ఈ పార్టీలు కాంగ్రెస్ కు గట్టి ప్రత్యర్థులుగా.. బీజేపీతో తెర‌వెనుక స‌న్నిహితంగా.. మౌన అవగాహన కలిగి ఉన్నాయి. మేం వాటిని భావసారూప్య పార్టీలుగా పరిగణించం అని ఆ నాయ‌కుడు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆహ్వానించినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ను ఆహ్వానించలేదు. ఆజాద్ పార్టీకి ఎలాంటి ప్రాముఖ్యత లేదని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. తన పార్టీకి చెందిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి అతన్ని ఆహ్వానించడానికి మాకు ఎటువంటి కారణం కనిపించలేదని తెలిపారు. భార‌త్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి భావసారూప్యత కలిగిన ప్రతి భారతీయుడు పాల్గొనాలని మేం ఆహ్వానించాం అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా యాత్రలో వివిధ దశల్లో నడిచారనీ, జనవరి 30న మధ్యాహ్నం శ్రీనగర్ లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ‘నేడు భారతదేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’ అని, ఆ సమయంలో యాత్ర లక్షలాది మందికి నేరుగా కనెక్ట్ అవుతుందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజనలు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనత, మన దేశ ప్రజలపై ముప్పు వంటి తీవ్రమైన అంశాలపై చర్చించాం. సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొని తమ సమస్యలను పంచుకున్నాయి… ప్రజలతో ఈ ప్రత్యక్ష సంభాషణ యాత్ర ప్రధాన విజయం అని ఖర్గే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement