Sunday, May 12, 2024

Karimnagar: నలుగురు మహిళల మృతిపై బండి సంజయ్ దిగ్భ్రాంతి

కరీంనగర్‌ పట్టణంలో కమాన్‌ వద్ద ఈ రోజు తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన నివాసముండే నలుగురు  మహిళలను బలితీసుకున్న దుర్ఘటనపై కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమాన్ ప్రాంతంలో వీధి వ్యాపారం చేసుకుంటూ అక్కడే  తాత్కాలిక గుడిసెల్లో నివాసం ఉంటున్న ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలు కారు ప్రమాదంలో  మృత్యువాత పడడం  విచారకరమని ఆయన అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రోడ్డు పక్కనే గుడిసెల్లో నివాసం ఉండి వృత్తిని కొనసాగించే వీరిని కారు ప్రమాదం బలి కొనడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నాయి. క్షతగాత్రులకు, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా వైద్య అధికారులను ఎంపీ బండి సంజయ్ సూచించారు. అలాగే స్థానిక బీజేపీ శ్రేణులు ప్రమాద స్థలానికి తరలి వెళ్లి, బాధితులకు అండగా నిలిచి తగిన సహాయ సహకారాలు అందాంలచని ఎంపీ బండి సంజయ్ ఆదేశించారు.

కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును వదిలేసి నలుగురు యువకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కారుపై 9 ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement