Friday, May 27, 2022

నగరాల్లో వాయుకాలుష్యం ఆందోళనకరం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య

ప్ర‌భ‌న్యూస్ :  ఇంటికీ వెంటిలేషన్ అనేది చాలా కీలమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యావత్ ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి ఇంట్లో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ – బ్రాంకస్ 2021’ రెండో వార్షిక సదస్సును ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గాలి ప్రసారం లేనిచోటే గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనల్లో వెల్లడైన అంశాన్ని ప్రస్తావించారు. సరైన స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి మన జీవనంలో ప్రాధాన్యతను కల్పించాలనే విషయాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసిందని ఆయన పేర్కొన్నారు. అందుకే నివాస ప్రాంతాలు, పనిచేసే చోట సరైన వెలుతురు, గాలి ప్రసారం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు


 
కరోనా అనంతర పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన శ్వాసకోస వ్యవస్థ ప్రాధాన్యత ప్రజలకు తెలిసొచ్చిందని, అయితే ఈ విషయంలో వారిలో మరింత అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పొగాకు వినియోగం ద్వారా పెరుగుతున్న ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు కేన్సర్ వంటి సమస్యల విషయంలోనూ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటం, మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉండటంపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాహన కాలుష్యం తదితర అంశాలు ఇందుకు కారణమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడూ రానున్న సమస్యలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో తమ బాధ్యతను గుర్తెరగాల్సిన తక్షణావసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.


 
రొబోటిక్స్, కన్ఫోకల్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ భారతదేశంలోని వివిధ ఆసుపత్రులు పల్మనాలజీ సంబంధిత వైద్యంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. వ్యాధి నిర్ధారణ, వినూత్న చికిత్సావిధానాలు, సానుకూల ఫలితాలు సాధిస్తున్నందున.. యావత్ భారతదేశం, ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా భాసిల్లే దిశగా వేగంగా ముందుకెళ్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల కల్పన అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి వైద్యరంగంను అనందించాలి అని అన్నారు. ‘ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో భారతదేశానికి ఉన్న శక్తి, సామర్థ్యాలను వినియోగిస్తూ గ్రామాల్లోని ప్రజలకు ప్రపంచస్థాయిలో టెలిమెడిసిన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు వైద్య వసతులు అందుబాటు ధరల్లో ఉండేలా భాగస్వామ్య పక్షాలన్నీ కృషిచేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital


 

Advertisement

తాజా వార్తలు

Advertisement