Saturday, January 29, 2022

Big Story: యాసంగిలో ఏం వేయాలి.. నేటికీ ప్ర‌ణాళిక లేదు.. అయోమ‌యంలో అధికారులు, రైతులు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పడం.. మరోవైపు యాసంగిలో సాగుచేయాల్సిన పంటలపై స్పష్టత లేకపోవడంతో వ్యవసాయ శాఖ తర్జనభర్జన పడుతోంది. రైతుల‌కు ఏం చెప్పాల‌నే ఆలోచనలో పడ్డారు అధికారులు. పంటలు మార్పిడి చేయాలన్న ఆలోచనల నేపథ్యంలో యాసంగి ప్రణాళిక రోజురోజుకి ఆలస్యం కావడం, నిర్ధిష్టమైన ప్రణాళికను ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో యాసంగి పంటలు 7లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో వరి ఇప్పటికే 745 ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి (నవంబర్‌ 24) కేవలం 10 ఎకరాల్లోనే సాగయిన వరి.. ఈ సారి ఇప్పటికే 745 ఎకరాల్లో సాగవ్వడం గమనార్హం.

దీని ప్రకారం యాసంగిలో వరి పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కాగా పంటల మార్పిడిలో భాగంగా సాగవుతున్న వేరుశనగ, శనగ కూడా సాధారణంగా సాగయ్యే జిల్లాల్లోనే తప్ప.. మిగతా జిల్లాల్లో ఆశించిన మేర సాగుకాకపోవడం గమనార్హం. మొత్తానికి యాసంగి ప్రణాళిక ఆలస్యం నేపథ్యంలో ఒకవైపు వరి తగ్గింపుపై నిర్ధిష్టమైన అంచనా లేకపోవడం, మరోవైపు వరి స్థానంలో సాగుచేయాల్సిన పంటలకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అదును దాటిన పదును.. సాగవుతున్న వరి..
రాష్ట్ర వ్యాప్తంగా పంటల మార్పిడిలో భాగంగా నూనెగింజలు, పప్పు, తృణధాన్యాల పంటలను విరివిగా సాగుచేయించాలని అధికారులు భావించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనబడడంలేదు. పొద్దుతిరుగుడు రాష్ట్రంలో సాధారణంగా 10,947 ఎకరాల్లో సాగయ్యేందుకు అవకాశం ఉన్నా.. ఇప్పటివరకూ 2,664 ఎకరాల్లోనే వేశారు. నువ్వులు 45,320 ఎకరాలకు ఇప్పటివరకూ 530 ఎకరాలు, ఇతర పంటలు 2,22,148 ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 1,508 ఎకరాల్లోనే సాగయ్యాయి. ఇదిలా ఉండగా శనగకు ఇప్పటికే సమయం అయిపోగా, వేరుశనగకూ ఈ నెల 30తో విత్తుకునే సమయం దాటిపోయింది. దీంతోపాటు కుసుమలు, ఆవాలకు అస్స‌లు టైమ్‌ లేదు.

కాగా కొన్ని పంటలకు మాత్రమే అవకాశం ఉన్నా..ఆ పంటలకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. యాసంగిలో సాధారణంగా వరి 31,12,258 ఎకరాల్లో సాగువుతుండగా ఇప్పటికే 745ఎకరాల్లో సాగవడంతో, అధికారులు తగ్గుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీంతో ఈ యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గకపోతే కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

నో బాయిల్డ్‌, ఓన్లీ రా రైస్‌..
కేంద్రం చెబుతున్న దానిప్రకారం రాష్ట్రం నుంచి యాసంగి సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ను తీసుకోమని, రా రైస్‌ ఇస్తే తీసుకుంటామని అంటుంది. కానీ యాసంగిలో రా రైస్‌ ఇచ్చేందుకు అవకాశాలు తక్కువ, వాతావరణం, ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడ్లను మిల్లింగ్‌ చేస్తే నూక శాతం ఎక్కువ వస్తుంది. కనుకనే రా రైస్‌ ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చెబుతున్నా.. కేంద్రం పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో యాసంగిలో వరి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతోంది.

యాసంగిలో బాయిల్డ్‌ వద్దు రా రైస్‌ కావాలంటున్న కేంద్రం ప్రస్తుత ధాన్యంలోనూ 60లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేస్తానని చెప్పడంతో, వానాకాలం ధాన్యం రా రైస్‌ కనుక వీటకి మరికొంత కోటా పెంచి అంటే మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా.. సరైన సమాధానమివ్వలేదు, కాగా నిర్దేశించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది.

ఇపుడేం చేద్దాం.. ఇతర ప్రాంతాల నుంచి వరి విత్తనాలు..
యాసంగి ధాన్యంపై కేంద్రం నుంచి స్పష్టత రావడంతో యాసంగి పంటలకు సంబంధించి ఏం చేద్దామని అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ మేరకు ఇప్పటికే తయారుచేసిన యాసంగి ప్రణాళికలో మార్పులు చేసి ప్రకటిద్దామా లేక మరో ప్రణాళిక సమయానుకూల పంటలతో ప్రకటిద్దామా అనే సందిగ్దతలో ఉన్నారు. యాసంగిలో వరి వేయోద్దంటున్న ప్రభుత్వ సూచనల్లో భాగంగా అధికారులు వరి విత్తనాలను విక్రయించొద్దని విత్తన దుకాణదారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో రైతులు ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలను కొనుగోలు చేసి మరి నార్లు పోస్తున్నారు.

అయోమయంలో అన్నదాతలు..
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టంచేయడంతో..వరి స్థానంలో మరి ఏం పంటలు వేయాలోనని రైతులు ఆలోచిస్తున్నారు. పంటల సాగుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో అన్నదాతలు అయోమయంలో ఉండిపోయారు. ప్రభుత్వాల తీరు అర్ధంకాక.. ప్రతిఏటా యాసంగి పంటల మాదిరిగానే సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు సూచించిన పంటలను సాగుచేస్తే పంటలు చేతికొచ్చే సమయానికి మద్దతు ధరలుంటాయా లేదా అని రైతుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికి బాయిల్డ్‌ రైస్‌ కొనుబోమని కేంద్రం చెప్పడం, పంటల మార్పిడిపై స్పష్టత లేకపోవడంతో యాసంగి పంటలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement