Friday, April 26, 2024

కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

మహారాష్ట్రను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనా మహమ్మారితో విలవిలలాడిన మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు వర్షాలు, వరదలతో అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్రలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజా జీవనం స్తంభించిపోయింది. మహారాష్ట్రల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 60 మంది చనిపోయారు. పదుల సంఖ్యల్లో రాతి శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొంకణ్ లోని రాయగడ్ జిల్లా తలాయి గ్రామంలో కొండచరియలు ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 36 మంది చనిపోయారు.  ఒకేచోట 32 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో చోట నుంచి మరో 4 మృతదేహాలను తీశారు. వేలాది మంది వరదలు, కొండచరియలలో చిక్కుకున్నారు.

ముంబై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గడ్‌లోని వరద బాధిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. సతారా జిల్లాలోని మిర్గావ్ లో మరో 12 మంది బలయ్యారు. సతారాలోని అంబేగార్ లోనూ ఇలాంటి ఘటనే జరగడంతో పదుల సంఖ్యలో రాళ్ల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో భారీ వర్షానికి ఇల్లు కూలి నలుగురు వ్యక్తులు చనిపోయారు. రత్నగిరి జిల్లాలోని చిప్లున్ లో వరద తాకిడికి కాలనీల్లో 12 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. కరెంట్, మంచినీళ్ల సరఫరా నిలిచిపోయింది. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు భారీ వర్షాల తాజా పరిస్థితిపై అధికారులతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ కేసు నమోదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement