Monday, April 29, 2024

Sports | వరల్డ్​ చాంపియన్స్​పై భారత జట్టు సంచలన విజయం.. ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్ మనదే

భారత పురుషుల బ్యాడ్మింటన్ జంట సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. రెండేళ్లుగా సూపర్ ఫామ్ లో ఉన్న ఈ జంట మరో ప్రతిష్టాత్మక టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000లోని డబుల్స్ విభాగంలో చాంపియన్స్ గా నిలిచారు. ఈ టైటిల్‌ నెగ్గడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. 21-17, 21-18తో ప్రపంచ చాంపియన్స్, మలేసియా జోడీ ఆరోన్‌ చియా-వూయ్‌ ఇక్‌ సోహ్‌ పై వరుస సెట్లలో గెలుపొంది టైటిల్ ను సొంతం చేసుకుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ జంట ఆడింది రెండు గేమ్సే అయినా గెలుపు కోసం రెండు జంటలు తీవ్రంగా పోటీ పడ్డాయి. పోటాపోటీగా పాయింట్లు సాధించారు. అయితే.. కీలక సమయాల్లో స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో పాటు సమర్థవంతమైన డిఫెన్స్ ను ప్రదర్శించిన భారత జోడీ వరుస గేముల్లో విజయాన్ని అందుకుంది. ఇండోనేసియా ఓపెన్‌ పురుషుల డబుల్స్ లో భారత్‌కు ఇది తొలి టైటిల్‌. సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్ లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల తర్వాత ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్‌-చిరాగ్‌ జోడీ.. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ, టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం​ తెలిసిందే.

ఈ సీజన్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. స్విస్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ వరకు చేరింది.  గతేడాది జరిగిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌ లో స్వర్ణం కూడా సాధించింది. థామస్ కప్‌ స్వర్ణం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతాకాలను చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు కూడా సాధించారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ విభాగంలో వీరిద్దరు అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఈ సారి జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణమే లక్ష్యంగా సాగుతున్నారు.

ఇక.. భారత బ్యాడ్మింటన్ స్టార్​ పుల్లెల గోపీచంద్ ప్రస్తుత జట్టుతో కలిసి ఇండోనేషియాకు వెళ్లారు. పురుషుల డబుల్స్ ఫైనల్‌తో సహా చాలా మ్యాచ్‌లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాచ్​ గెలిచిన సాత్విక్​, చిరాగ్​ అతడిని మాంత్రికుడిగా అభివర్ణించారు. తాము కోచ్‌లు, ఫిజియోలు.. శిక్షకులతో చాలా కష్టపడి సాధన చేశామని, కానీ జట్టు వెనుక ఉన్న ప్రయత్నాలన్నీ (క్రెడిట్) గోపీ సార్ కే చెందుతాయన్నారు. చాలా కాలం తర్వాత తమ మ్యాచ్‌లను చూసేందుకు గోపీ సర్​ వచ్చారు. అతను కోర్టులో మాంత్రికుడిగా కనిపించారు. అతను అక్కడ ఉన్నప్పుడు తాము ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. అంతే ఈజీగా ఆటను ఆస్వాదిస్తూ ఆడాం అని సాత్విక్​ చెప్పాడు. అయితే.. ఈసారి టోర్నమెంట్‌ను గెలవడం కంటే, ఆరోన్, సోహ్‌ని ఓడించడం మా టార్గెట్​గా పెట్టుకున్నాం అని చిరాగ్​ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement