Sunday, April 28, 2024

ఐపీఎల్​ కొత్త ఫార్మాట్​.. మ్యాచుల తీరును రివీల్​​ చేసిన బీసీసీఐ

అత్యంత ఖరీదైన ఆటగా టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ పేరుగాంచింది. దీంట్లో కొత్తగా రెండు జట్లు చేరడతో ఈ లీగ్‌లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గెలిచిన ఐపీఎల్ ట్రోఫీలు, ఫైనల్స్ చేరిన సందర్భాల సంఖ్యను బట్టి విభజించారు. దీంతో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై, 4 సార్లు విజేత అయిన చెన్నై వేర్వేరు గ్రూపుల్లో ఉండనున్నాయి.

గ్రూప్‌ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్‌ ఉన్నాయి. గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఉన్నాయి. అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపులోని ఒక్కో జట్లు మిగతా జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది. అలాగే మరో గ్రూపులోని ఒక జట్టుతో రెండు మ్యాచులు ఆడి.. ఆ గ్రూపులోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జట్టు అదే గ్రూపులోని మిగతా 4 జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ బిలో చెన్నైతో కూడా రెండు మ్యాచులు ఆడుతుంది. కానీ, ఆ గ్రూపులోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడుతుంది.

అదేవిధంగా గ్రూప్ బిలో బెంగళూరు జట్టు ఆ గ్రూప్‌లోని అన్ని జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ ఏలోని రాజస్థాన్ రాయల్స్‌తో కూడా రెండు మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ ఏలో మిగిలిన 4 జట్లతో మాత్రం ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడుతుంది. మార్చి 26న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ మే 29న ముగియనుంది. ఈ మ్యాచులన్నీ ముంబై, పూణేల్లోనే జరగనున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ జరిగే వేదికలను ఇంకా నిర్ణయించలేదని బీసీసీఐ తెలిపింది. అంటే శ్రీలంకతో భారత్ ఆడాల్సిన టెస్టు సిరీస్ ముగిసిన 10 రోజుల్లోనే ఐపీఎల్ మొదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement